150 ఇందిరమ్మ ఇళ్ల నిధులు ఒకే ఖాతాలోకి…?
నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు మండలలో సుమారు రూ.5 కోట్లకు పైగా నిధులు స్వాహా అయినట్లు తెలుస్తోంది.

హుజూర్ నగర్ ఐసీఐసీఐ బ్యాంక్ లో లబ్ధిదారులందరికీ ఒకే అకౌంట్..!
హుజూర్ నగర్ నియోజక వర్గంలో ‘ఇందిరమ్మ’ ఇళ్లలో రూ. 5 కోట్ల నిధులు గోల్మాల్..?
హౌసింగ్ అధికారుల కనుసన్నల్లోనే నిధుల మళ్లింపు..?
నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లతో అధికారుల ‘దోస్తీ’..!
అధికార పార్టీ నేతల సహకారంతో లబ్ధిదారులతో కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు..!
హైదరాబాద్, ఏప్రిల్ 24, నిజం చెపుతాం:
ఇందిరమ్మ ఇళ్ల’ పథకం హుజూర్ నగర్ నియోజకవర్గంలో అక్రమార్కులకు, అధికారులకు, అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి లబ్ధిదారుల కళ్లుగప్పి కొందరు హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించినట్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు మండలలో సుమారు రూ.5 కోట్లకు పైగా నిధులు స్వాహా అయినట్లు తెలుస్తోంది.
ఆధార్ సీడింగ్‌కు పాతర.. పూల్ అకౌంటే ఆసరా..!
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇందిరమ్మ ఇళ్ల నిధులు ఆధార్ సీడింగ్ ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నాలుగు విడతల్లో జమ కావాలి. కానీ హుజూర్ నగర్ హౌసింగ్ విభాగంలో ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. లబ్ధిదారుల సొంత ఖాతాలను కాదని హుజూర్ నగర్ లోని ఐసీఐసీఐ బ్యాంకులో ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేశారు. ఈ ఖాతా ఒక సంస్థ పేరు మీద ఉన్న ఒక ‘పూల్ అకౌంట్’. ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్న ఈ నంబర్ 4629527600281492 లోనే నియోజకవర్గంలోని సుమారు 150 మందికి పైగా లబ్ధిదారుల నిధులు మళ్లించినట్లు సమాచారం.
ఆధార్ సీడింగ్‌లో చిన్న తప్పులున్నా నిధులు జమకాని ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత భారీ స్థాయిలో నిధులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీనికి గృహ నిర్మాణ శాఖ అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇదంతా వారికి తెలిసే జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి.
కాంట్రాక్టర్లదే రాజ్యం.. అధికారుల అండదండలు..!
నియోజకవర్గంలోని దర్శించర్ల, వేపల సింగారం, జాన్ పాడు గ్రామాలలో 30 నుంచి 50 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లను కాంట్రాక్టుగా తీసుకొని కట్టే విధంగా అధికార పార్టీ నేతల సమక్షంలో కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. వీరు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ లబ్ధిదారులకి మాత్రం “మాకు హౌసింగ్ అధికారుల పర్మిషన్ ఉంది.. అంతా లీగలే” అంటూ బహిరంగంగానే కాంట్రాక్టర్లు లబ్ధిదారులకు చెప్పి వారి పేరు మీద ఉన్న ఎకౌంట్లను తీసివేసి, వీరి సంస్థ పేరుతో ఐసిఐసిఐ బ్యాంకులో నూతనంగా తీసిన ఎకౌంట్ లో లబ్ధిదారుల డబ్బులు పడేవిధంగా సెట్ చేశారు. నిర్మాణం వివిధ దశల్లో ఉండగా ప్రభుత్వం నుండి పడే డబ్బులు ఈ అకౌంట్లో పడుతుండగా లబ్ధిదారులకు మాత్రం సెల్ ఫోన్ కు మెసేజ్ లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కొక్క లబ్ధిదారులకు సంబంధించి 3 లక్షల 40 వేల రూపాయలు వీరి అకౌంట్లో పడినట్లుగా తెలుస్తోంది.
లబ్ధిదారుడి అకౌంట్లోకి ఎన్ని డబ్బులు వస్తున్నాయో కూడా తెలియనివ్వకుండా, కాంట్రాక్టరే నేరుగా డ్రా చేసుకునే వెసులుబాటును సదరు హౌసింగ్ అధికారులు వెసులుబాటు కల్పించడం వెనుక భారీ ‘కమీషన్ల’ పర్వం నడిచినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు మా ఖాతాలో పడుతున్నాయి..
కాంట్రాక్టర్.
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు మండలాలలో సుమారు 150 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టినట్టు తెలిపాడు. లబ్ధిదారులకు ఇంటి పనులు పూర్తవుతున్నా లబ్ధిదారులు తమ ఖాతాలో పడిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో
స్థానిక అధికార పార్టీ నాయకుల సమక్షంలో లబ్ధిదారులతో రాతపూర్వక అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాతే తాము నిర్మాణ పనులు ప్రారంభించామని తెలుపుతున్నాడు. లబ్ధిదారుల అనుమతితోనే వారి ఎకౌంట్లను తీసుకోకుండా మా సొంత అకౌంట్లో డబ్బులు పడేలా ఏర్పాటు చేసుకున్నామని తెలుపుతున్నాడు. ఇలా చేయకపోతే లబ్ధిదారులు పనిచేసిన తర్వాత డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అందుకే
వారి అనుమతితోనే హుజూర్ నగర్ లోని ఐసిఐసిఐ బ్యాంక్ లో ఒక అకౌంట్ ను తీసి లబ్ధిదారుల నిధులు అందులో జమ అయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. డబ్బులు పడగానే లబ్ధిదారు ఇండ్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇదంతా ఆయా గ్రామాల పెద్దల సహకారంతోనే చేసినట్లు చెబుతున్నాడు. అప్పుడప్పుడు లబ్ధిదారుల ఎకౌంట్లో గ్యాస్ డబ్బులు, ఉపాధి హామీ డబ్బులు పడుతున్నాయని వాటిని కూడా మేము తీసి వారికి ఇస్తున్నామని తెలిపారు.
లబ్ధిదారుల ఎకౌంట్లోనే పడుతున్నాయి..
డివిజనల్ ఇంజనీర్ (డీఈ) జగన్…
లబ్ధిదారుల డబ్బులు ఒకే అకౌంట్లో ఎలా పడుతున్నాయని గృహ నిర్మాణ శాఖ డిఈ ని వివరణ కోరగా..!
పైలెట్ ప్రాజెక్టుగా నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆధార్ సీడింగ్ ప్రకారమే లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నామని ఆధార్ సీడింగ్ చేసే సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు దొర్లినా కూడా అకౌంట్లో డబ్బులు జమ అయ్యే అవకాశం లేదని తెలిపాడు. లబ్ధిదారుల డబ్బులు వారి ఖాతాలలోనే పడుతున్నాయని మరొక ఖాతాలో పడే అవకాశం లేదని చెబుతున్నాడు.



