SIR జాబితా భయం.. కారు డ్రైవర్ విషాదాంతం – పేరు లేదన్న ఆందోళనతో ఆత్మహత్య
ఎస్ఐఆర్ (SIR) జాబితాలో తన పేరు లేదన్న ఆందోళనతో 51 ఏళ్ల కారు డ్రైవర్ షేక్ ముజీబుర్ రహ్మాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్, జూన్ 29 (నిజం న్యూస్):
హైదరాబాద్ నగరంలోని బోరబండ భరత్‌నగర్‌లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐఆర్ (SIR) జాబితాలో తన పేరు లేదన్న ఆందోళనతో 51 ఏళ్ల కారు డ్రైవర్ షేక్ ముజీబుర్ రహ్మాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల విడుదలైన ఎస్ఐఆర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో ముజీబుర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. “నన్ను జైలుకు పంపితే మన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారు?” అంటూ భార్యతో పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. భార్య ఎంత నచ్చజెప్పినా ఆయనలో నెలకొన్న భయం తొలగకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది.
ఇటీవల ఎస్ఐఆర్ జాబితాలకు సంబంధించి పలు రకాల ప్రచారాలు, అపోహలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటన కూడా భయాందోళనలు, అపోహలు కుటుంబాల్లో ఎంతటి విషాదాలకు దారితీస్తాయో మరోసారి గుర్తు చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



