పసిఫిక్ ఎఫెక్ట్‌కు ముగింపు.. రెండు తెలుగు రాష్ట్రాలకు బంగాళాఖాతం తెచ్చిన వర్షాల శుభవార్త!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. దీంతో రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నిజం న్యూస్ | జూలై 3, 2026
గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు శుభవార్త అందింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నీనో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవగా, ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. దీంతో రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటీవల వరకు ఎల్నీనో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో వర్షాలు కురవకపోగా, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. వరి నారుమడులు ఎండిపోకుండా కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి సాగు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణంలో అనుకూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ కోస్తా, గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా, పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ప్రజలకు ఉపశమనం లభించనుండగా, రైతుల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



