బడికి రాని టీచర్లపై వేటు.. ఏడాది గైర్హాజరైతే కఠిన చర్యలు
విద్యాశాఖ దీర్ఘకాలంగా గైర్హాజరయ్యే ఉద్యోగులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 14, 2026 | నిజం న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై విద్యాశాఖ దీర్ఘకాలంగా గైర్హాజరయ్యే ఉద్యోగులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఏడాది గైర్హాజరైతే చర్యలు
అనుమతి లేకుండా ఏడాది పాటు విధులకు హాజరుకాని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై ఉద్యోగ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. గైర్హాజరును గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేసి, సీసీఏ (CCA) రూల్స్ ప్రకారం శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని ఆదేశించారు.
5 ఏళ్లు దాటితే రాజీనామాగా పరిగణన
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగికైనా ఐదేళ్లకు మించి సెలవు ఇవ్వడానికి అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు లేదా ఇతర సిబ్బంది అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు గైర్హాజరైతే, నిబంధనల ప్రకారం ఉద్యోగంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విదేశాల్లో ఉండి తిరిగి రాని వారికి కూడా ఇదే నిబంధన
ఉద్యోగానికి సెలవు తీసుకుని విదేశాలకు వెళ్లి, అనుమతించిన గడువు ముగిసిన తర్వాత కూడా విధుల్లో చేరని వారికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక గైర్హాజరు విషయంలో సంబంధిత ఉద్యోగి సర్వీస్ రికార్డును పరిశీలించి శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు.
అకడమిక్‌కు ఆటంకం
టీచర్లు అనుమతి లేకుండా విధులకు హాజరుకాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీనివల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు గైర్హాజరైన ఉపాధ్యాయులు, సిబ్బందిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్డీఈలు, డీఈఓలకు ఆదేశాలు వెళ్లాయి.
అబ్సెంట్‌ను గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీసు ఇచ్చి, సీసీఏ రూల్స్ ప్రకారం విచారణ ప్రారంభించాలని విద్యాశాఖ సూచించింది. విచారణ అనంతరం నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అధికారులపైనా నిఘా
గైర్హాజరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసే హెడ్‌మాస్టర్లు, ఎంఈఓలు, డీఈఓలను కూడా బాధ్యులను చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రతి డీఈఓ కార్యాలయంలో దీర్ఘకాలంగా గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి, దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
‘డైస్ నాన్’గా గైర్హాజరు కాలం
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన కాలాన్ని నిబంధనల ప్రకారం ‘డైస్ నాన్’గా పరిగణించే అవకాశం ఉంది. అలాంటి కాలానికి జీతం, ఇంక్రిమెంట్లు, సర్వీస్ ప్రయోజనాలు, పెన్షన్ లెక్కింపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అయితే ఉద్యోగం నుంచి తొలగింపు లేదా రాజీనామాగా పరిగణించడం వంటి తుది చర్యలు సంబంధిత సర్వీస్ నిబంధనలు, ఉద్యోగి గైర్హాజరు పరిస్థితులు, ఇచ్చిన నోటీసులకు సమాధానం, శాఖాపరమైన విచారణ తదితర అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి.
శ్రీనివాస్ నాయక్ – స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



