ప్రియుడి కోసం భర్తను పాముకాటుతో చంపించిన దామిని.. ఇప్పుడు జైలులోనూ ప్రియుడి కోసమే కన్నీరు!
స్కూల్ యజమానిగా ఉన్న తన భర్త అమిత్ కశ్యప్‌ను మోసం చేస్తూ, అదే స్కూల్‌లో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే తుషార్‌తో దామిని అక్రమ సంబంధం కొనసాగించింది. భర్త తమ సంబంధానికి అడ్డుగా మారడంతో అతడిని హత్య చేయాలని ఇద్దరూ కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.

| నిజం న్యూస్
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన పాముకాటుతో హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో స్కూల్ యజమాని అమిత్ కశ్యప్ హత్య కేసులో అరెస్టైన అతని భార్య దామిని ప్రస్తుతం జైలులోనూ తన ప్రియుడు తుషార్ కోసమే తల్లడిల్లుతున్నట్లు సమాచారం.
భర్త హత్య కేసులో ఇటీవల జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లిన దామిని, అదే జైలులో వేరే బ్యారెక్స్‌లో ఉన్న తన ప్రియుడు తుషార్‌ను ఒక్కసారి అయినా కలిసేలా ఏర్పాటు చేయాలని జైలు అధికారులను వేడుకున్నట్లు తెలుస్తోంది.
జైలు వర్గాల సమాచారం ప్రకారం, దామిని జైలు అధికారుల కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, “ఎలాగైనా తుషార్‌ను కలిసే అవకాశం ఇవ్వండి. అతడిని ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేను” అంటూ వేడుకున్నట్లు తెలిసింది. అయితే జైలు నిబంధనల ప్రకారం ఒకే కేసులో ఉన్న సహ నిందితులు పరస్పరం మిలాఖాత్ ద్వారా కలుసుకోవడం సాధ్యం కాదని జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వీరేశ్ రాజ్ శర్మ స్పష్టం చేశారు. అనంతరం ఆమెను మందలించి తిరిగి తన బ్యారెక్స్‌కు తరలించినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, స్కూల్ యజమానిగా ఉన్న తన భర్త అమిత్ కశ్యప్‌ను మోసం చేస్తూ, అదే స్కూల్‌లో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే తుషార్‌తో దామిని అక్రమ సంబంధం కొనసాగించింది. భర్త తమ సంబంధానికి అడ్డుగా మారడంతో అతడిని హత్య చేయాలని ఇద్దరూ కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.
కుట్రలో భాగంగా భర్తకు ముందుగా పాలలో మత్తుమందు కలిపి ఇచ్చిన దామిని, అనంతరం పాములు పట్టే సోను, ఉదయ్ అనే ఇద్దరిని రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని ఇంటికి పిలిపించింది. వారు తీసుకొచ్చిన విషసర్పాలతో అమిత్ కశ్యప్‌ను కాటేయించి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మొదట ఈ ఘటనను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు, నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో మొత్తం కుట్ర బయటపడింది.
ప్రస్తుతం దామిని, ఆమె ప్రియుడు తుషార్, అలాగే సోను, ఉదయ్ నలుగురూ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



