విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. యాజమాన్యాలకూ బాధ్యత..

మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని సూచించారు.

కఠిన చట్టానికి సీఎం రేవంత్ రెడ్డి సంకేతం

హైదరాబాద్, జూలై 24 (నిజం న్యూస్):

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా బాధ్యత వహించేలా నిబంధనలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని సూచించారు.

 

శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

 

విద్యా సంస్థల క్యాంపస్‌లతో పాటు క్యాంపస్ వెలుపల విద్యార్థులు పాల్గొనే అనుమానాస్పద కార్యకలాపాలను కూడా గుర్తించి పోలీసులకు సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను గుర్తించేందుకు ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

 

డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రతి విద్యా సంస్థలో టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని గుర్తించడం, బాధితులను డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి కౌన్సెలింగ్ అందించడం, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.

 

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతలను కూడా అప్పగించాలని సీఎం స్పష్టం చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు.

 

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

-శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button