అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లంచం డిమాండ్.. రూ.63 వేలతో ఏసీబీకి చిక్కిన సీడీపీఓ!
21 అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కరీంనగర్ ఏసీబీ అధికారులు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 | నిజం న్యూస్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దరోజు పద్మ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల సమయంలో ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసి, రూ.63 వేల నగదును స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. మెట్‌పల్లి పట్టణ మండల పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున అక్రమంగా డబ్బులు ఇవ్వాలని సీడీపీఓ డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. మూడు నెలలకు సంబంధించి మొత్తం రూ.63,000 చెల్లించాలని కోరినట్లు వెల్లడించారు.
లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఈ నెల 26న ఫిర్యాదుదారుడి నుంచి తన కార్యాలయ ప్రాంగణం వెలుపల రూ.63,000 నగదును సీడీపీఓ నేరుగా స్వీకరించిన సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తన ప్రకటనలో వెల్లడించింది.
తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, అధికారిక అనుకూలత చూపించేందుకు అక్రమంగా లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది.
న్యాయస్థానానికి తరలింపు.. కొనసాగుతున్న విచారణ
ఏసీబీ అధికారులు సీడీపీఓను అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వివరాలను వెల్లడించలేదు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. తెలంగాణ ఏసీబీ వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



