షాబాద్‌లో రక్తపాతం.. పగతో 6 గురి హత్య..! పోక్సో కేసు కక్షతో కిరాతకానికి తెగబడ్డ నిందితుడు
షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తిపై గతంలో ఓ మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఫిర్యాదు చేసిన కుటుంబంపై కక్ష పెంచుకున్న నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది

నిజం న్యూస్ | జూలై 11, 2026 | రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం తెల్లవారుజామున రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో ఓ వ్యక్తి ఒకే రోజులో ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తిపై గతంలో ఓ మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఫిర్యాదు చేసిన కుటుంబంపై కక్ష పెంచుకున్న నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
శనివారం తెల్లవారుజామున బాలిక ఇంటికి చేరుకున్న నిందితుడు ముందుగా కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. అనంతరం మైనర్ బాలికను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ఇంతటితో ఆగకుండా తన సొంత ఇంటికి వెళ్లి భార్య సరితతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేశాడు. అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి “ఆరుగురిని చంపేశాను… నేను కూడా చనిపోతున్నాను” అని చెప్పినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు అందించగా, పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటన స్థలాలను ఉన్నతాధికారులు పరిశీలించి, ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా అనే అంశాన్ని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది.
మృతుల వివరాలు
– చిట్యాల రుక్కమ్మ (65)
– చిట్యాల లక్ష్మీ (45)
– మైనర్ బాలిక (17)
– పార్వతి సరిత (30)
– పరీక్షిత్ (3)
– దైవిక్షిత్ (2)
ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే రోజులో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



