శిథిలావస్థకు చేరిన మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం.. ఏఎస్సైకి గాయాలు!
సీలింగ్ పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటంతో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. గాయపడిన ఏఎస్సై శ్రీనివాసరావును వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మహబూబాబాద్ జిల్లా, ఆగస్టు 11 (నిజం న్యూస్):
మరిపెడ పోలీస్ స్టేషన్లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలావస్థకు చేరుకున్న పాత పోలీస్ స్టేషన్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై శ్రీనివాసరావుపై ఒక్కసారిగా సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో ఆయన భుజానికి గాయాలయ్యాయి.
సీలింగ్ పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటంతో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. గాయపడిన ఏఎస్సై శ్రీనివాసరావును వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మరిపెడ పోలీస్ స్టేషన్ పాత భవనం చాలాకాలంగా శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సీలింగ్, గోడలు తదితర నిర్మాణ భాగాలు దెబ్బతినడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళన సిబ్బందిలో నెలకొంది. తాజాగా సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్సైకి గాయాలు కావడంతో భవనం భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
భవనం పరిస్థితి ఇలాగే కొనసాగితే సీలింగ్ పెచ్చులు, గోడల భాగాలు ఊడిపడటంతో పాటు భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజూ స్టేషన్కు వచ్చే ప్రజల భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని పేర్కొంటున్నారు.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీస్ సిబ్బందే ప్రమాదకరమైన భవనంలో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి రావడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నూతన పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులో ఉన్న నేపథ్యంలో పాత భవనం నుంచి వెంటనే సిబ్బందిని నూతన భవనంలోకి తరలించాలని కోరుతున్నారు.
పాత భవనం పరిస్థితిని ఉన్నతాధికారులు తక్షణమే పరిశీలించి, ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవనం పూర్తిగా కూలిపోయి ప్రాణనష్టం సంభవించే పరిస్థితి రాకముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



