రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్!
రూ.50 వేలతో ప్రారంభమైన బేరం.. చివరకు రూ.30 వేలకు ఒప్పందం

హైదరాబాద్, నవంబర్ 22 | నిజం న్యూస్
హైదరాబాద్‌లో విద్యుత్ శాఖకు చెందిన సబ్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గాంధీనగర్ సెక్షన్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జి. సంతోష్ ఆనంద్ శనివారం (నవంబర్ 21) ఫిర్యాదుదారుడి నివాసం వద్ద రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
విద్యుత్ చోరీకి సంబంధించిన ఆరోపణలపై ఫిర్యాదుదారుడిపై తదుపరి చర్యలు తీసుకోకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు సదరు అధికారి మొదట రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం రూ.35 వేలకు తగ్గించి, చివరకు రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల సమయంలో సబ్ ఇంజనీర్ రూ.30 వేల లంచం సొమ్మును స్వయంగా లెక్కించి తన ప్యాంటు ఎడమవైపు వెనుక జేబులో పెట్టుకున్నాడు. అనంతరం ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ వెల్లడించింది.
నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వారి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్



