రూ.20 వేలు డిమాండ్.. రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కారోబార్
రెండు ఇళ్ల మ్యుటేషన్ ఫైల్ ప్రక్రియ కోసం లంచం.. జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్

హైదరాబాద్, అక్టోబర్ 7 | నిజం న్యూస్
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి బి.అరుణ, కాంట్రాక్ట్ కారోబార్ దాసరి సంతోష్ ఏసీబీ వలలో చిక్కారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి పేరుపై ఉన్న రెండు ఇళ్లకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తు ఫైల్‌ను ముందుకు పంపించి, ప్రక్రియ పూర్తి చేసేందుకు పంచాయతీ కార్యదర్శి అరుణ తొలుత రూ.20 వేల లంచాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.15 వేలకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు వల పన్నారు. అక్టోబర్ 6న ఉదయం సుమారు 11 గంటలకు జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంట్రాక్ట్ కారోబార్ దాసరి సంతోష్ ద్వారా రూ.15 వేల లంచం స్వీకరిస్తుండగా పంచాయతీ కార్యదర్శి అరుణతో పాటు సంతోష్‌ను పట్టుకున్నారు. లంచం సొమ్ము రూ.15 వేలను సంతోష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల విచారణకు సంబంధించిన రెండో అదనపు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఫిర్యాదుదారుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు లేదా సిబ్బంది ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



