రికార్డే లేని రేషన్ షాపు.. 40 ఏళ్లుగా యథేచ్చగా దోపిడీ..?
40 ఏళ్లుగా ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్, రెన్యువల్ లేకుండా ఒక నకిలీ డీలర్ షాపును నడుపుతున్నా రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకుందని, ఇది పచ్చి అవినీతికి నిదర్శనమని భానోతు భీమా (సమాచార ఉద్యమకారుడు) ఆరోపిస్తున్నారు.

తెలిసీ చర్యలు తీసుకోని తహసీల్దార్, ఆర్డీవో పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
హుజూర్ నగర్ నియోజకవర్గంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు లేకుండా మరో 15 రేషన్ దుకాణాలు ఉన్నట్లు సమాచారం..!
– భానోతు భీమా (సమాచార ఉద్యమకారుడు)
హుజూర్ నగర్ / నేరేడుచర్ల:
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని రేషన్ షాప్ నెం. 4015018 వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. 40 ఏళ్లుగా ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్, రెన్యువల్ లేకుండా ఒక నకిలీ డీలర్ షాపును నడుపుతున్నా రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకుందని, ఇది పచ్చి అవినీతికి నిదర్శనమని భానోతు భీమా (సమాచార ఉద్యమకారుడు) ఆరోపిస్తున్నారు.

*అసలు విషయం ఏమిటి?*
రామాపురం గ్రామానికి చెందిన రేషన్ షాప్ నెంబర్ 4015018 ను చింతమల్ల సైదులు తండ్రి రామ నర్సయ్య 40 ఏళ్లుగా నడుపుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆ షాపును కొమర్రాజు నరేష్ అనే వ్యక్తికి ఇంచార్జ్ గా అప్పగించారు. దీనిపై భానోతు భీమా అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా విచారణ జరిగింది.
విచారణలో బయటపడిన నిజాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
*1. తహసీల్దార్ నివేదికలోనే అసలు గుట్టు రట్టు (లేఖ నెం: B/806/2026, తేదీ: 19.08.2026):*
నేరేడుచర్ల తహసీల్దార్ స్వయంగా విచారించి “డీలర్ దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు” అని RDO నివేదిక పంపారు.
*2. RDO ఆఫీస్ లో రికార్డే లేదు (లేఖ నెం: C/3819/2025, తేదీ: 18.12.2025):*

ఈ షాపునకు సంబంధించిన నోటిఫికేషన్, నియామక పత్రం, విద్యార్హతలు, ప్రొసీడింగ్స్ ఇవ్వాలని RTI కింద అడిగితే, హుజూర్ నగర్ RDO కార్యాలయం *”మీరు కోరిన సమాచారం ఈ కార్యాలయం నందు లభ్యముగా లేదు”* అని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
అంటే ప్రభుత్వ రికార్డుల్లోనే ఈ షాపుకు ఎటువంటి అస్తిత్వం లేదని అధికారికంగా తేలిపోయింది.
*3. జిల్లా సప్లై ఆఫీసర్ ఆదేశాలు బుట్టదాఖలు (లేఖ నెం: CS9/188/2025, తేదీ: 07.03.2026):*
ఈ వ్యవహారంపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి, హుజూర్ నగర్ RDO కి ఆదేశాలు ఇచ్చినా, ఈ రోజు వరకు ఆ షాపును రద్దు చేయలేదు.

*చట్టం ఏం చెబుతోంది?*
అధికారులు తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం స్పష్టమైన చట్ట ఉల్లంఘన.
*ఎ) తెలంగాణ రాష్ట్ర లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (నియంత్రణ) ఆర్డర్, 2016 ప్రకారం:*
– *క్లాజ్ 5(1) & 5(2):* ప్రతి చౌకధర దుకాణానికి రాజస్వ మండలాధికారి (RDO) నుండి లిఖితపూర్వక ఆధరైజేషన్ ఉండాలి.
– *క్లాజ్ 12 – రెన్యువల్:* ప్రతి ఆధరైజేషన్ ను ప్రతి *2 సంవత్సరాలకు ఒకసారి* తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ ఫీజు చెల్లించి, సక్రమంగా దుకాణం నడిపితేనే రెన్యువల్ చేస్తారు.
– *క్లాజ్ 19 – రద్దు:* రెన్యువల్ చేయకపోతే లేదా నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆ ఆధరైజేషన్ ను ఎటువంటి నోటీసు లేకుండా రద్దు చేసి, ఆ షాపును ఖాళీగా ప్రకటించాలి.
40 ఏళ్లలో కనీసం 20 సార్లు రెన్యువల్ జరగాలి. కానీ ఒక్క రెన్యువల్ రికార్డు కూడా RDO ఆఫీస్ లో లేకపోవడం అంటే, ఆ షాపు 20 సార్లు రద్దు అయినట్లే లెక్క.
– *క్లాజ్ 6(3):* ఖాళీ అయిన షాపుకు ఇంచార్జ్ ఇవ్వకూడదు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి, రిజర్వేషన్ ప్రకారం కొత్త డీలర్ ను నియమించాలి. ఇక్కడ కొమర్రాజు నరేష్ కు ఇంచార్జ్ ఇవ్వడం పూర్తిగా అక్రమం.
*బి) నిత్యావసర సరుకుల చట్టం, 1955 ప్రకారం:*
– *సెక్షన్ 3 మరియు సెక్షన్ 7:* ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, లైసెన్స్ లేకుండా ప్రజా పంపిణీ సరుకులను అక్రమంగా నిల్వ చేయడం, పంపిణీ చేయడం క్రిమినల్ నేరం. ఇందుకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
*డిమాండ్:*
తహసీల్దార్, ఆర్డీవో హుజూర్ నగర్ కార్యాలయాలకు రికార్డు లేదని తెలిసినా, ఈ రోజు వరకు షాపును రద్దు చేయకుండా, ఇంచార్జ్ పేరుతో అవినీతిని ప్రోత్సహిస్తున్నారు.
1. రేషన్ షాప్ నెం. 4015018 ను వెంటనే రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి.
2. 40 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా షాపు నడిపిన వారిపై, మరియు తెలిసీ చర్యలు తీసుకోని అధికారులపై Essential Commodities Act సెక్షన్ 7 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బానోతు భీమా డిమాండ్ చేస్తున్నాడు



