స్కూల్ ఫీజులపై కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఉద్యమం..
క్యా బోల్తీ పబ్లిక్" అనే నినాదంతో తల్లిదండ్రుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

“క్యా బోల్తీ పబ్లిక్”తో దేశవ్యాప్త క్యాంపెయిన్‌కు శ్రీకారం
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (నిజం న్యూస్):
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న స్కూల్, కాలేజీ ఫీజులు, కోచింగ్ సెంటర్ల అధిక ఫీజుల వసూళ్లపై కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైంది. “క్యా బోల్తీ పబ్లిక్” అనే నినాదంతో తల్లిదండ్రుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, దేశంలో విద్య సాధారణ కుటుంబాలకు అందని భారం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటో తరగతి విద్యార్థికే లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు లక్షల రూపాయల ఫీజులను ఎలా భరించగలరని ఆయన ప్రశ్నించారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది సమాజానికి ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో వసూలు చేస్తున్న ఫీజులపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు, ప్రభుత్వాల స్పందన, అవసరమైన సంస్కరణలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకుని వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
విద్య అనేది ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, అయితే ప్రస్తుతం అది వ్యాపారంగా మారిపోయిందని అభిజీత్ దీప్కే విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యా భారాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



