విద్యుత్ ప్రమాద బాధితులకు బిగ్ రిలీఫ్.. మృతుల కుటుంబాలకు రూ.8 లక్షలు
కరెంట్ షాక్ కారణంగా మరణించిన వారికి అందించే పరిహారాన్ని రూ.5 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నూతన పరిహారం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ ,నిజం న్యూస్, జూలై 30:
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కరెంట్ షాక్ కారణంగా మరణించిన వారికి అందించే పరిహారాన్ని రూ.5 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నూతన పరిహారం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త విధానం ప్రకారం, విద్యుత్ శాఖ ఉద్యోగులు కాని వ్యక్తులు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందితే వారి కుటుంబాలకు మొత్తం రూ.8 లక్షల పరిహారం అందజేయనున్నారు. ఇందులో రూ.7.20 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) రూపంలో, రూ.80 వేల నగదు రూపంలో చెల్లిస్తారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంతో పాటు భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అదేవిధంగా, విద్యుత్ ప్రమాదాల వల్ల పశువులు మృతి చెందిన సందర్భాల్లో కూడా పరిహారం పెంచారు. ఆవు, గేదె, దున్నపోతు మృతి చెందితే రూ.40 వేల వరకు, గొర్రె లేదా మేక మృతి చెందితే రూ.7 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.
విద్యుత్ తీగలు తెగిపడటం, ట్రాన్స్ఫార్మర్లు లేదా ఇతర విద్యుత్ పరికరాల వల్ల జరిగే ప్రమాదాలపై సంబంధిత అధికారులు విచారణ నిర్వహించిన అనంతరం నిబంధనల ప్రకారం పరిహారం మంజూరు చేయనున్నారు. ప్రజలు వర్షాకాలంలో తెగిపోయిన విద్యుత్ తీగలు, నీటిలో ఉన్న విద్యుత్ పరికరాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూచించింది.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



