రాష్ట్ర వ్యాప్తంగా 1.28 లక్షల ఆసరా పింఛన్లు రద్దు

అనర్హులపై ప్రభుత్వం కఠిన చర్యలు.. 48 వేల కొత్త అర్హులకు త్వరలో పింఛన్ల మంజూరు

హైదరాబాద్, జూన్ 19 (నిజం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఆసరా పింఛన్ ధృవీకరణ ప్రక్రియలో భారీ స్థాయిలో అనర్హులను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక వెరిఫికేషన్‌లో అర్హత ప్రమాణాలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్న 1.28 లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారి పేర్లను అధికారిక లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

 

ప్రభుత్వం ఇటీవల గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో పింఛన్ లబ్ధిదారుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించింది. గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఇంటింటి ధృవీకరణ నిర్వహించి లబ్ధిదారుల అర్హతలను పరిశీలించారు. ఈ ప్రక్రియలో మృతి చెందిన వ్యక్తుల పేర్లపై పింఛన్లు కొనసాగుతున్న ఘటనలు, అర్హత కోల్పోయిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అధిక భూములు కలిగిన వారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కూడా పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు.

 

అధికారుల వివరాల ప్రకారం రద్దు చేసిన 1.28 లక్షల పింఛన్లలో 1.02 లక్షల పింఛన్లు గ్రామీణ ప్రాంతాలకు, మిగిలిన 26 వేల పింఛన్లు పట్టణ ప్రాంతాలకు చెందినవి. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక సంఖ్యలో అనర్హులు గుర్తించబడటం విశేషం.

 

పింఛన్ల రద్దుకు ప్రధాన కారణాలు

 

మృతి చెందిన వ్యక్తుల పేరిట పింఛన్లు కొనసాగడం

 

లబ్ధిదారులు గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం

 

ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లడం

 

ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు పింఛన్లు పొందడం

 

ఐదు ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి కలిగి ఉండడం

 

ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా ఉండడం

 

 

ఈ కారణాలతో అనర్హులుగా తేలిన వారి పింఛన్లను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉండగా, పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న కొత్త అర్హులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 48 వేల మంది వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖ నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే వారికి కొత్త పింఛన్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 

ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు నెలకు రూ.2,016, వికలాంగులకు రూ.4,016 ఆసరా పింఛన్ అందుతోంది. అనర్హుల తొలగింపుతో ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతో పాటు నిజమైన పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

 

శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button