ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత కోరిన హైకోర్టు – జీవో 7 సస్పెన్షన్ కొనసాగింపు
హైకోర్టు, “విద్యార్థులకు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?” అనే అంశంపై స్పష్టత లేకపోవడాన్ని తప్పుబట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 24కి వాయిదా వేసింది.

హైదరాబాద్, మే 5:
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. జీవో నెం.7పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడం కుదరదని స్పష్టం చేసిన కోర్టు, విద్యార్థుల ఖాతాల్లో ఫీజు బకాయిలు ఎప్పుడు జమ చేస్తారో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా జీవో 7 ఉందని పేర్కొంటూ దానిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది.
అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది, ఫీజు బకాయిలను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జీవోపై సస్పెన్షన్ రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు.
దీనిపై స్పందించిన హైకోర్టు, “విద్యార్థులకు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?” అనే అంశంపై స్పష్టత లేకపోవడాన్ని తప్పుబట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 24కి వాయిదా వేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యమవడం వల్ల విద్యార్థులు, కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈసారి కోర్టు మరింత కఠినంగా వ్యవహరించినట్లు న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన టైమ్‌లైన్ వస్తేనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.



