గులాబీ గూటిలో ’రఘు’లుతున్న చిచ్చు…!

మంత్రి ఉత్తమ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం, బలమైన నాయకుడు ఇక్కడ ఉండటంతో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత నివ్వాలని బీఆర్ఎస్ పార్టీలోని రెడ్లు అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గం కావడం, ప్రజలకు చేరువగా ఉండి, స్తానికుడైతే  ఎవరికైనా గెలుపు అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రెడ్ల అసంతృప్తి.. సమన్వయం సవాలేనా..!

పిల్లుట్ల రాకతో మొదలైన ముసలం..!

దాడులు చేసిన వారితోనే దోస్తీ..!

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలక కేంద్రమైన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పదివేల ఓట్లకు పైగా సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచిన ‘ఓజో’ ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు.. తాజాగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కమలం గూటికి చేరడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు రఘు చేరిక కొత్త ఆశలు చిగురింపజేస్తుందని భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రెడ్ల అధిపత్యం కనిపించే ఈ నియోజకవర్గంలో బీసీ నాయకుడు ముందుకు సాగేనా లేక నాలుగు రోజులు వాడుకుని వదిలేస్తారా వేచి చూడాల్సిందే.

మంత్రి ఉత్తమ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం, బలమైన నాయకుడు ఇక్కడ ఉండటంతో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత నివ్వాలని బీఆర్ఎస్ పార్టీలోని రెడ్లు అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గం కావడం, ప్రజలకు చేరువగా ఉండి, స్తానికుడైతే  ఎవరికైనా గెలుపు అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రెడ్ల అసంతృప్తి.. సమన్వయం సవాల్..!

పిల్లుట్ల రాకను పార్టీలోని రెడ్ల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తమను కాదని, నిన్నగాక మొన్న వచ్చిన వారికి ‘ఇంచార్జ్’ బాధ్యతలు అప్పగిస్తే ఎలా అని కొందరు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మండల స్థాయి నేతలతో రఘు మంతనాలు జరిపినా, కీలక నేతలు ఆయనకు దూరంగా ఉండటం పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది. పాత కేడర్‌ను, కొత్త నాయకత్వాన్ని ఏకం చేయడం రఘుకు ముళ్ళబాట వంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

గుర్రుగా రెడ్డి సామాజిక వర్గం నేతలు..!

బీసీ సామాజిక వర్గానికి చెందిన రఘు పార్టీలో చేరడం, ఆయనకు ప్రాధాన్యత పెరగడంపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలోని 7మండలాల్లో 15 మంది రెడ్ల ముఖ్య నాయకులు రఘును పార్టీలో చేర్చుకోవద్దని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కోరగా ఆయన వ్యతిరేకించినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇవ్వవద్దంటూ కేటీఆర్‌ను కలిసి తమ నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రఘు తన రాజకీయ కార్యకలాపాలను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రెడ్ల అధిపత్యంపై పోరును కొనసాగిస్తాడా లేక మధ్యలోనే కాడిని పడేస్తాడన్నది చూడాలి.

సేవ ‘పాక్షికం’.. నినాదం ‘బహుజనం.!

ఓజో ఫౌండేషన్ ద్వారా పిల్లుట్ల రఘు చేసిన సేవా కార్యక్రమాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని గ్రామాల్లో పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంపై ప్రజల్లో అసహనం నెలకొంది. ఎన్నికల ముందే సేవలు గుర్తొస్తాయా? అని కొందరు నిలదీస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన ‘బిడ్డ’గా ప్రజల్లోకి వెళ్లాలని రఘు యోచిస్తున్నారు.

టికెట్ దక్కేనా?

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకే టికెట్ దక్కుతుందనే ధీమాతో రఘు ఉన్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తుంది? క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఎలా ఏకం చేస్తారు? అన్నది వేచి చూడాలి. బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ‘బిడ్డ’గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్న రఘుకు, సొంత పార్టీలోని అసమ్మతి సెగలే పెద్ద అడ్డంకిగా మారేలా ఉన్నాయి.

దాడులు చేసిన వారితోనే దోస్తీ..!

రాజకీయం అంటేనే విచిత్రమైన కలయిక. గతంలో సైదిరెడ్డి అనుచరుల చేతిలో భౌతిక దాడులకు గురైన రఘు, ఇప్పుడు అదే పార్టీ శ్రేణులతో కలిసి ఎలా పనిచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. “గతంలో దాడులు జరిగిన చోటే ఇప్పుడు జెండా పట్టుకోవాల్సి రావడం విచిత్రం. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకేనన్న ధీమాతో రఘు అడుగులు వేస్తున్నప్పటికీ, రెడ్డి కుల నాయకులతో కలిసి పార్టీని గట్టెక్కించి, ప్రజల ఆమోదం పొందడం ఆయనకు ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button