కౌన్సిలర్ల పాలిట శాపమైన ఎన్నికల ఖర్చు..!

కౌన్సిలర్ల పరిస్థితి ఇప్పుడు 'ముందు నుయ్యి - వెనుక గొయ్యి'లా మారింది..!

వార్డుపై పాగా వేయాలన్న పట్టుదల వారిని పీఠంపై కూర్చోబెట్టింది కానీ.. ఆ గెలుపు తెచ్చిన అప్పులు ఇప్పుడు వారిని నిద్రపోనివ్వడం లేదు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో గెలిచిన కొందరు కౌన్సిలర్ల పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి – వెనుక గొయ్యి’లా మారింది. పదవి దక్కిన సంతోషం కంటే, పెరిగిన వడ్డీల ఆందోళనే వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

లక్షలు కుమ్మరించి.. అప్పుల్లో మునిగి..!

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు శక్తికి మించి ఖర్చు చేశారు. ప్రత్యర్థులను తలదన్నేలా ప్రచారం, ఇతర ఖర్చుల కోసం భారీగా అప్పులు తెచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టి, తెలిసిన వారి వద్ద అధిక వడ్డీలకు తెచ్చిన నగదుతో ఎన్నికల బరిలో నిలిచారు. గెలిచాక పనులు చేసి పెడతామని హామీలు ఇచ్చారు కానీ, ప్రస్తుతం ఆ అప్పులే వారికి గుదిబండగా మారాయి.

వడ్డీల సెగ.. వేధిస్తున్న ఆర్థిక భారం..!

నెల తిరిగేసరికి లక్షలాది రూపాయల వడ్డీలు చెల్లించాల్సి రావడంతో కౌన్సిలర్లు బెంబేలెత్తుతున్నారు. ఆదాయ మార్గాలు లేక, ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యమవడంతో అసలు కంటే వడ్డీలే కొండలా పెరిగిపోతున్నాయి.

పదవి గౌరవం చందాల భారం..!

వార్డు సభ్యుడిగా గెలిస్తే ఏదో వెలిగిపోతామనుకున్న వారికి క్షేత్రస్థాయిలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చులే ఒక ఎత్తు అనుకుంటే, పండగ పండగకూ చెల్లించే చందాలు వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. హోదా ఉంది కానీ.. జేబులో పైసా మిగలడం లేదని ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు.

వార్డుల్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఊర్లో ఏ పండగ వచ్చినా చందా కోసం మొదటి సంతకం వార్డు సభ్యుడిదే ఉండాలి. “మా ఓట్లతోనే గెలిచారు కదా.. మా పండగకు ఇవ్వరా?” అన్న ఓటర్ల డిమాండ్‌తో చేసేదేమీ లేక ‘సమర్పించుకుంటున్నారు.

రాజకీయ ఆకలి.. ఆర్థిక గోస..!

గెలిచిన కొత్తలో ఉత్సాహంగా ఉన్న సభ్యులు, ఇప్పుడు పండగలు వస్తుంటే చాలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకునే పరిస్థితికి చేరుకున్నారు. ఒక్కో వార్డులో పదుల సంఖ్యలో యువజన సంఘాలు, ఉత్సవ కమిటీలు ఉండటంతో అందరినీ సంతృప్తి పరచడం సామాన్య సభ్యులకు భారంగా మారింది.

పరువు కోసం పాట్లు..!

బయటికి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నా.. లోపల అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక సతమతమవుతున్నారు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచుతుండటంతో ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదన అనుభవిస్తున్నారు.

పదవి ఉంటే చాలదు.. నిధులు కావాలి..!

వార్డులో చిన్న పని చేయాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొందని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన సంతోషం లేకుండా పోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. గెలుపు ఉత్సాహాన్ని అప్పుల ఊబి మింగేస్తోందన్నది అక్షర సత్యం.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button