20 ఏళ్ల ప్రజా ప్రస్థానానికి మిడ్జిల్ వేదిక.. ప్రజల రుణం అభివృద్ధితో తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో నిన్న నిర్వహించిన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు.

నిజం న్యూస్ | మిడ్జిల్ | జూలై 6, 2026
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో నిన్న నిర్వహించిన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన, తన రాజకీయ జీవితంలో ప్రజలే తనకు బలం అని పేర్కొంటూ మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “గడిచిన 20 ఏళ్లలో ఏనాడూ సెలవు తీసుకోలేదు. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాను. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని, అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశా” అని అన్నారు.
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మిడ్జిల్‌ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలని, అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మండలాన్ని దత్తత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు.
“ఇక్కడ ప్రజలు నాకు సర్వం ఇచ్చారు. నన్ను పెంచి పోషించారు. ఆనాడు మొక్కనాటిన మిడ్జిల్ మండలాన్ని అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాపై ఉంది. కరవుతో అల్లాడుతున్న డార్క్ ఏరియా కాదు.. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి” అని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
“జులై 4, 2006న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మీద మిడ్జిల్ ప్రజలు ఒక చరిత్రను లిఖించిన రోజు. జెడ్పీటీసీగా గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. నిజాం సర్కార్ నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు పనిచేశారు” అని గుర్తు చేశారు.
అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి, ఆయన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన ద్యాప గోపాల్ రెడ్డి గుడియాన్పల్లి వాసులని, మహేంద్రనాథ్ ఈ ప్రాంతం నుంచి ఆదర్శ నాయకుడిగా నిలిచారని స్మరించుకున్నారు. ద్యాప గోపాల్ రెడ్డితో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.
“జెడ్పీటీసీగా నాతో కలిసి పనిచేసిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు తెలుసు. ఆనాడు చాలా గ్రామాలకు రోడ్లు లేవు. అభివృద్ధి లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిడ్జిల్ మండలాన్ని, గద్వాల్ నియోజకవర్గంలోని గట్టు మండలాన్ని డార్క్ ఏరియాలుగా ప్రకటించారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు.. ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన మండలాలుగా ఉండేవి” అని అప్పటి పరిస్థితులను వివరించారు.
“అత్యంత వెనుకబడిన ఈ మండల ప్రజలు 2006లో తీసుకున్న నిర్ణయంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలిచాను. అందుకే ఈ మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నాపై ఉంది” అని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. “40 ఏళ్లుగా నానుతున్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు పరిష్కారం చూపించాం. వందేళ్లుగా జరగని వెనుకబడిన తరగతుల కులగణన చేపట్టాం. లెక్క తేల్చడమే కాకుండా వారి వాటా వారికి అందేలా చర్యలు ప్రారంభించాం. ముఖ్యమంత్రిగా అవకాశం రావడం వల్లే ఈ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించగలిగాం” అని తెలిపారు.
“నేను పుట్టింది గ్రామంలో. గ్రామంలో అన్ని కులాలు, మతాలు, అన్ని సమస్యలను, పేదవాడి కష్టాలను చూస్తూనే పెరిగాను. వ్యవసాయం తెలుసు. దుక్కి దున్నడం తెలుసు. విత్తనం వేయడం తెలుసు. భూమికి, విత్తనానికి ఉన్న బంధం ఏమిటో.. పేదవాడికి, పరిపాలన చేసే వాడికి ఉండాల్సిన అవగాహన ఏమిటో నాకు తెలుసు” అని పేర్కొన్నారు.
“రాష్ట్రమంటే, దేశమంటే ఎక్కడో లేదు. 12 వేలపైచిలుకు గ్రామపంచాయతీలు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షలకుపైగా గ్రామాలు కలిస్తేనే భారతదేశం. గ్రామాల్లో సమస్యలు పరిష్కారమైతేనే మండలం, జిల్లా, రాష్ట్రం వరుసగా అభివృద్ధి చెందుతాయి. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారమైతేనే దేశం అభివృద్ధి చెందినట్టే” అని అన్నారు.
చివరగా, “మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికి నా ప్రాణమిచ్చినా తక్కువే. వలసల పాలమూరును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



