భర్తనే హత్య చేయించిన ఎంవీఐ అధికారి.. అక్రమ సంబంధం కోసం కాంట్రాక్ట్ కిల్లర్లతో దారుణం!
సమితకు అజిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధంగా మారినట్లు విచారణలో తేలింది. తమ సంబంధానికి భర్త అడ్డుగా మారతాడనే ఉద్దేశంతో అతడిని హత్య చేయించాలని సమిత ప్రియుడిని ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ధీరజ్ ద్వారా కాంట్రాక్ట్ కిల్లర్లను ఏర్పాటు చేసి, రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దేవకుమార్‌పై కాల్పులు జరిపి హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

17 జూలై 2026 | నిజం న్యూస్
బీహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైల్వే ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తను కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించిన కేసులో రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI)గా పనిచేస్తున్న సమిత (Sumita)తో పాటు ఆమె ప్రియుడు అజిత్ కుమార్, కుట్రలో పాల్గొన్న మరో వ్యక్తి ధీరజ్ మరియు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం, సమిత భర్త దేవకుమార్ గుంజన్ రైల్వే శాఖ ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య చదువుకు సహకరించి ఆమెను ప్రభుత్వ అధికారిగా నిలబెట్టిన దేవకుమార్, తరచూ రైళ్లలో డ్యూటీలకు వెళ్లి వచ్చేవాడు.
ఈ సమయంలో సమితకు అజిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధంగా మారినట్లు విచారణలో తేలింది. తమ సంబంధానికి భర్త అడ్డుగా మారతాడనే ఉద్దేశంతో అతడిని హత్య చేయించాలని సమిత ప్రియుడిని ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ధీరజ్ ద్వారా కాంట్రాక్ట్ కిల్లర్లను ఏర్పాటు చేసి, రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దేవకుమార్‌పై కాల్పులు జరిపి హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.
గత నెల 11వ తేదీన జరిగిన ఈ హత్య కేసును ఛేదించేందుకు రైల్వే పోలీసులు, జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ పర్యవేక్షణలో సీసీటీవీ ఫుటేజ్‌లు, మొబైల్ కాల్ డేటా రికార్డులు (CDR), నిందితుల కదలికలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా అనుమానాలు సమితపై కేంద్రీకరించాయి.
విచారణలో సమిత ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమె ప్రియుడు, కుట్రలో పాల్గొన్న ఇతర నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. అనంతరం అందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించారు.
ఈ ఘటన బీహార్‌లో తీవ్ర సంచలనం రేపింది. భర్త కష్టపడి చదివించి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడేలా చేసిన భార్యే, అక్రమ సంబంధం కోసం అతడిని కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



