ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
అధికారుల సమాచారం ప్రకారం జూన్ 26 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచన
అమరావతి, జూలై 17 (నిజం న్యూస్):
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా వైరస్ (COVID-19) కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అధికారుల సమాచారం ప్రకారం జూన్ 26 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కోవిడ్ పాజిటివ్ కేసుల్లో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ముగ్గురు బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
అయితే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కూడా COVID-19 కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా మళ్లీ విజృంభిస్తుందా? మరోసారి లాక్‌డౌన్ పరిస్థితులు వస్తాయా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో ఎదురైన తీవ్రమైన పరిస్థితులు ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వైరస్ పూర్తిగా అంతరించిపోలేదని, కాలానుగుణంగా కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే మాస్క్ ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు.
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా, ప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసే అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని అధికారులు సూచించారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



