రాష్ట్రంలో మళ్లీ వర్షాల విజృంభణ.. మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్, హైదరాబాద్, జూన్ 22, 2026:
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాగల మూడు గంటల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముండగా, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రేపు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, రైతులు వ్యవసాయ పనుల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
_శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



