చిన్నారి అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్ – నిరంజన్‌కు పరామర్శ, ఆర్థిక సాయం, కుటుంబానికి భరోసా

నిరంజన్‌ను ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలతో మాట్లాడి వైద్య చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు నిరంజన్‌కు ఉంటాయని కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు.

వరంగల్, జూన్ 17 (నిజం న్యూస్):

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన యువ అభిమాని నిరంజన్‌ను బుధవారం స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. అభిమాని కోరికను గౌరవిస్తూ ఇంటికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

 

తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ డి.ఎన్.డి. అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. శారీరక ఎదుగుదల లేకపోవడంతో అతను మంచానికే పరిమితమయ్యాడు. చిన్ననాటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న నిరంజన్, తన చివరి కోరికగా ఆయనను కలవాలని కోరుకున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

 

నిరంజన్‌ను ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలతో మాట్లాడి వైద్య చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు నిరంజన్‌కు ఉంటాయని కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు.

 

ఈ సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. అలాగే నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు.

 

అభిమానిని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్

 

నిరంజన్‌ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అతనితో కొంతసేపు గడిపారు. లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అతని మంచం వద్ద కూర్చుని ఆత్మీయంగా హత్తుకొని, నుదిటిపై ముద్దు పెట్టి పరామర్శించారు. “చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం” అని నిరంజన్ చెప్పిన మాటలు ఆయనను కదిలించాయి.

 

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్‌కు కప్పి, కళ్యాణం అక్షతలు అందజేశారు. అలాగే భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని హామీ ఇచ్చారు.

 

నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన డాన్స్ వీడియోలు, ఫొటోలను పరిశీలించారు. తనను అందరూ “చోటా గబ్బర్ సింగ్” అని పిలుస్తారని నిరంజన్ చెప్పగా పవన్ కళ్యాణ్ స్పందించారు.

 

కుటుంబ జీవనోపాధికి చేయూత

 

పరామర్శ సందర్భంగా నిరంజన్ తనకు కుక్క పిల్లను పెంచుకోవాలనే కోరిక ఉందని తెలిపాడు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ కుక్క పిల్లను పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇంటి యజమానుల అనుమతి అవసరమని నిరంజన్ తండ్రి చెప్పడంతో, వారిని పిలిపించి మాట్లాడారు.

 

అనంతరం నిరంజన్ తల్లిదండ్రుల జీవనోపాధి గురించి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్‌లో పని చేశామని వారు చెప్పడంతో, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు సూచించారు.

 

పరామర్శ కార్యక్రమం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, నాయకులు రాధారం రాజలింగం, ఆర్.కే. సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

— శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button