వర్షాల కోసం మహా వరుణయాగం.. పూర్ణాహుతి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

నాగార్జునసాగర్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది

ఆగస్టు 10, 2026 | నిజం న్యూస్

నాగార్జునసాగర్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా ఈ పవిత్ర యాగంలో పాల్గొన్నారు.

దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన వరుణయాగంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి నదులు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

“రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి” అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

భారతీయ సంస్కృతిలో వర్షాల కోసం యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని ప్రభుత్వం పేర్కొంది. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతూనే.. వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహం కోసం ఈ వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ రంగానికి, రైతులకు మేలు జరగాలని ప్రభుత్వం ఆకాంక్షించింది.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, హోమగుండాల వద్ద నిర్వహించిన వైదిక క్రతువులతో నాగార్జునసాగర్ కృష్ణా నది తీరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మహా వరుణయాగం పూర్ణాహుతితో ముగిసింది.

-శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button