ఎస్బీఐపై సర్కార్ ఫోకస్.. ప్రభుత్వ ఖాతాలు, డిపాజిట్లపై సమగ్ర ఆరా

భారతదేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన State Bank of India (ఎస్బీఐ)లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ని ఖాతాలు ఉన్నాయి, వాటిలో ఎంత మేర నిధులు డిపాజిట్ రూపంలో ఉన్నాయి, నెలవారీ లావాదేవీలు ఎంత జరుగుతున్నాయనే అంశాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, జూన్ 23 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్)

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, డిపాజిట్ల వివరాలపై సమగ్ర సమాచారం సేకరిస్తోంది.

ముఖ్యంగా భారతదేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన State Bank of India (ఎస్బీఐ)లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ని ఖాతాలు ఉన్నాయి,

వాటిలో ఎంత మేర నిధులు డిపాజిట్ రూపంలో ఉన్నాయి, నెలవారీ లావాదేవీలు ఎంత జరుగుతున్నాయనే అంశాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు లేఖలు పంపి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థల నిధుల నిర్వహణ, బ్యాంకింగ్ లావాదేవీలపై సమీక్ష చేపట్టిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాయదుర్గం భూముల వివాదం నేపథ్యం

ఇటీవల హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న విలువైన భూముల వేలం వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం-ఎస్బీఐ మధ్య వివాదానికి దారితీసింది. గతంలో అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు కేటాయించిన సుమారు ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని వేలం వేయగా, ఆ భూమిపై తమకే హక్కు ఉందంటూ ఎస్బీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం హైకోర్టు వేలం ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎస్బీఐతో ఉన్న ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివిధ శాఖలకు చెందిన డిపాజిట్లు, ఖాతాల వివరాలను సేకరించాలని ఉన్నతస్థాయి ఆదేశాలు జారీ అయినట్లు వార్తలు వెలువడ్డాయి.

డిపాజిట్ల ఉపసంహరణపై చర్చ?

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎస్బీఐ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారని, అవసరమైతే ప్రభుత్వ శాఖల డిపాజిట్లను ఇతర బ్యాంకులకు మళ్లించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖాతాలు, సంక్షేమ పథకాల నిధుల పంపిణీ, అనేక ప్రభుత్వ లావాదేవీలు ఎస్బీఐ ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్థిక రంగంలో చర్చనీయాంశం

ప్రభుత్వ ఖాతాలు, డిపాజిట్ల వివరాల సేకరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై చర్చ సాగుతోంది. ఎస్బీఐతో కొనసాగుతున్న భూవివాదం ఏ మలుపు తిరుగుతుందో, ప్రభుత్వ బ్యాంకింగ్ విధానంలో మార్పులు వస్తాయో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

— శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button