50 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ…? కేంద్రం పరిశీలనలో భారీ మార్పులు
డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీని 50 ఏళ్లకు పెంచే అంశం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రహదారి భద్రత, వైద్య పరీక్షలు, వయస్సు ఆధారిత నిబంధనలపై చర్చల అనంతరం అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.

నిజం న్యూస్ | న్యూఢిల్లీ | జూన్ 11, 2026
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ (DL) చెల్లుబాటు కాలాన్ని 20 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వయస్సు వరకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ సాధారణంగా 20 సంవత్సరాలు లేదా 40/50 ఏళ్ల వయస్సు వరకు (ఏది ముందుగా వస్తే అది) చెల్లుబాటు అవుతోంది. అనంతరం రీన్యువల్ తప్పనిసరి. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒకసారి లైసెన్స్ పొందిన వ్యక్తికి 50 ఏళ్ల వయస్సు వరకు నేరుగా చెల్లుబాటు కల్పించే విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మార్పు అమల్లోకి వస్తే ముఖ్యంగా యువతకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు, 18 ఏళ్ల వయస్సులో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రీన్యువల్ అవసరం లేకుండా వాహనం నడిపే అవకాశం ఉంటుంది. దీంతో RTO కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు, సమయ వ్యయం తగ్గనున్నాయని భావిస్తున్నారు.
ఇదే సమయంలో, వాహన యాజమాన్య బదిలీ (Ownership Transfer), లైసెన్స్ సేవలు, పర్మిట్ రీన్యువల్ వంటి సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని కూడా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని వల్ల మధ్యవర్తుల వ్యవస్థకు చెక్ పడటంతో పాటు ప్రజలకు మరింత పారదర్శక సేవలు అందే అవకాశం ఉంది.
అయితే, డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీని 50 ఏళ్లకు పెంచే అంశం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రహదారి భద్రత, వైద్య పరీక్షలు, వయస్సు ఆధారిత నిబంధనలపై చర్చల అనంతరం అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా కోట్లాది మంది డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు ఇది పెద్ద గుడ్‌న్యూస్‌గా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.



