బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి.. ఆర్.కృష్ణయ్య
కేంద్రంలో బీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సాధ్వి నిరంజన్ జ్యోతికి వినతిపత్రం సమర్పించారు

నిజం న్యూస్ | న్యూఢిల్లీ | మే 28, 2026
కేంద్రంలో బీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సాధ్వి నిరంజన్ జ్యోతికి వినతిపత్రం సమర్పించారు.
బీసీల ఆర్థిక, విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. అలాగే పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్, గురుకుల విద్యా వ్యవస్థలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కూడా సూచించారు.
బీసీ నేతలతో కలిసి బుధవారం జరిగిన ఈ భేటీలో సాధ్వి నిరంజన్ జ్యోతి సానుకూలంగా స్పందించి, సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు.



