లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. మధ్యవర్తి అరెస్ట్!

సాక్షుల విచారణకు సహకరించి కేసులో నిందితుడికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానంటూ రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి స్వీకరణ

హైదరాబాద్, నవంబర్ 18 | నిజం న్యూస్

పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు ఓ మధ్యవర్తిని పట్టుకున్నారు. పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ కోర్టులో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొంకెన రవీందర్, ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు.

ధర్మారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 12/2023 కేసులో నిందితుడికి అనుకూలంగా సాక్షుల విచారణ జరిగేలా సహకరించి, కేసులో నిర్దోషిగా బయటపడేలా చేస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తొలుత రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని రూ.1.50 లక్షలకు తగ్గించినట్లు తెలిపింది.

ఈ క్రమంలో నవంబర్ 18న పెద్దపల్లిలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివాసంలో మధ్యవర్తి ద్వారా రూ.1.50 లక్షల లంచం స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని మధ్యవర్తి రాజయ్య ప్యాంటు ఎడమ జేబు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతని రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లోనూ లంచం స్వీకరణకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ వెల్లడించింది.

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button