టర్మినేషన్ వెనుక కక్ష సాధింపేనా? జి ఈ సి ఓ అధికారిణిపై కేజీబీవీ ఎస్ఓ సరస్వతి సంచలన ఆరోపణలు!
పాత విభేదాల నేపథ్యంలో వేధింపులు.. వరుస తనిఖీలు, తప్పుడు నివేదికలతో టర్మినేషన్‌కు గురయ్యానంటూ ఆవేదన

మహబూబాబాద్ జిల్లా, సెప్టెంబర్ 28 | నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కేజీబీవీ నేరడలో ఎస్ఓగా పనిచేస్తున్న సరస్వతి ఇటీవల టర్మినేషన్‌కు గురైన నేపథ్యంలో తనకు జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ “నిజం న్యూస్” ను సంప్రదించారు. తనపై జరిగిన పరిణామాల వెనుక పాత విభేదాలు, అధికారుల వేధింపులు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
పాత విభేదాల నేపథ్యంలోనే వేధింపులా?
జి ఈ సి ఓగా పనిచేస్తున్న అధికారిణి గతంలో తమ గ్రామమైన కొత్తూరు-Cలో టీచర్‌గా పనిచేసిన సమయంలో తన తండ్రితో, పాఠశాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయని సరస్వతి తెలిపారు. ఆ పాత విభేదాలను దృష్టిలో పెట్టుకుని తాను పనిచేస్తున్న కేజీబీవీపై కూడా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
వరుస తనిఖీలు.. సెలవులో ఉన్నా విజిటింగ్
కేజీబీవీ నేరడను జి ఈ సి ఓ అధికారిణి పలుమార్లు సందర్శించి తనిఖీలు నిర్వహించారని సరస్వతి పేర్కొన్నారు. తాను అధికారికంగా సెలవులో ఉన్న సమయంలో కూడా ప్రత్యేకంగా విజిట్ చేసి, తనకు వ్యతిరేకంగా ఉండే విధంగా నివేదికల్లో ప్రతికూల అంశాలు నమోదు చేశారని ఆమె ఆరోపించారు.
వాట్సాప్ కాల్స్‌తో బెదిరింపులు చేశారంటూ ఆరోపణ
ఒక తనిఖీ అనంతరం రోజు తనకు జి ఈ సి ఓ అధికారిణి భర్త వాట్సాప్ ద్వారా కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని సరస్వతి ఆరోపించారు. ఇతర పాఠశాలల్లో జరిగిన కొన్ని ఘటనలను తనకు ముడిపెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు.
సీఆర్టీలను ఉసిగొల్పి ఆరోపణలు చేయించారని వాదన
తాను కొన్ని చట్టవిరుద్ధమైన సూచనలకు అంగీకరించకపోవడంతో, జి ఈ సి ఓ అధికారిణికి అనుకూలంగా ఉన్న కొంతమంది సీఆర్టీలను, సిబ్బందిని తనపైకి ఉసిగొల్పి తప్పుడు ఆరోపణలు చేయించారని సరస్వతి వాదించారు.
సీనియారిటీని పక్కనపెట్టి ఇంచార్జి బాధ్యతలు?
తనకు అనుకూలంగా ఉన్న ఒక సీఆర్టీకి “నీకు ఎస్ఓ ఇంచార్జి ఇప్పిస్తాను.. మనమందరం కలిసి పనిచేద్దాం” అంటూ ముందుగానే హామీ ఇచ్చారని సరస్వతి ఆరోపించారు. ముందుగానే చేసుకున్న రహస్య ఒప్పందం ప్రకారమే అనంతరం సీనియారిటీ ఉన్న వారిని పక్కనపెట్టి సదరు సీఆర్టీకి ఎస్ఓ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని ఆమె పేర్కొన్నారు.
కలెక్టర్‌కు తప్పుడు నివేదికలే కారణమంటూ ఆరోపణ
తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జి ఈ సి ఓ అధికారి కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు పంపడం వల్లే తన టర్మినేషన్‌కు పరిస్థితులు దారితీశాయని సరస్వతి ఆరోపించారు. తనపై జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
టర్మినేషన్పై సమగ్ర విచారణకు సరస్వతి విజ్ఞప్తి
“నా టర్మినేషన్‌కు దారితీసిన పరిణామాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్రంగా విచారణ జరపాలి. నాపై వచ్చిన ఆరోపణలు, సమర్పించిన నివేదికలు, తనిఖీల వివరాలు, సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలను నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. ఎలాంటి వ్యక్తిగత కక్షలు, ఒత్తిళ్లు లేదా పక్షపాతాలకు తావులేకుండా పూర్తి స్థాయి విచారణ నిర్వహించి, నిజానిజాలను నిర్ధారించి న్యాయం చేయాలని కోరుతున్నాను” అని సరస్వతి విజ్ఞప్తి చేశారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



