భవన అనుమతి కోసం రూ.20 వేల లంచం.. ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్
చార్మినార్ జోన్ సంతోష్‌నగర్ సర్కిల్-25లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సిహెచ్. ప్రభావతి భవన అనుమతి ఫైల్ ప్రాసెసింగ్ కోసం ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

హైదరాబాద్ | ఆగస్టు 18, 2026 | నిజం న్యూస్
భవన నిర్మాణ అనుమతి ఫైల్ ప్రాసెసింగ్‌తో పాటు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుమతి పత్రం ఇవ్వడానికి రూ.20 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
చార్మినార్ జోన్ సంతోష్‌నగర్ సర్కిల్-25లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సిహెచ్. ప్రభావతి భవన అనుమతి ఫైల్ ప్రాసెసింగ్ కోసం ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు మంగళవారం వల పన్ని, లంచం తీసుకుంటున్న సమయంలో ప్రభావతిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగిగా విధులు సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. అనంతరం నిందితురాలిని నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఏసీబీ వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ వెల్లడించింది.
శ్రీనివాస్ నాయక్-స్టేట్ బ్యూరో



