రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో గ్రామ పాలన అధికారి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ గ్రామ పాలన అధికారి (GPO) శ్రీ మాతే రాజేష్‌ను రూ.5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

జగిత్యాలలో అవినీతిపై ఉక్కుపాదం
జగిత్యాల, ఆగస్టు 6 (నిజం న్యూస్):
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ గ్రామ పాలన అధికారి (GPO) శ్రీ మాతే రాజేష్‌ను రూ.5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఆత్మకూర్ గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి మాతే రాజేష్, ఫిర్యాదుదారుడి పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించి ఉన్నత రెవెన్యూ అధికారులకు పంపాల్సిన విచారణ నివేదికను సమర్పించేందుకు అధికారిక అనుకూలం కల్పించే పేరుతో రూ.5,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు.
కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు పక్కా సమాచారంతో ఆత్మకూర్ గ్రామ పాలన కార్యాలయంలో ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి రూ.5,000 లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో కూడా బ్యాగ్‌పై పాజిటివ్ ఫలితం రావడంతో లంచం స్వీకరించినట్లు నిర్ధారణ అయింది.
అనంతరం గ్రామ పాలన అధికారిని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



