అస్సాంను అతలాకుతలం చేస్తున్న వరదలు.. 78కు చేరిన మృతులు

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్ జిల్లాలో ఒకరు మృతి చెందడంతో వరదల కారణంగా మృతుల సంఖ్య 78కు చేరుకుంది.

– 3 లక్షల మందిపై తీవ్ర ప్రభావం

గువాహటి | 30 జూలై 2026 | నిజం న్యూస్

అస్సాంలో కురుస్తున్న ఎడతెరిపి భారీ వర్షాలు రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. బ్రహ్మపుత్ర నది సహా పలు ఉపనదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో అనేక జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్ జిల్లాలో ఒకరు మృతి చెందడంతో వరదల కారణంగా మృతుల సంఖ్య 78కు చేరుకుంది.

 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 7 జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 551 గ్రామాలు పూర్తిగా లేదా పాక్షికంగా జలమయం అయ్యాయి. సుమారు 21,523 హెక్టార్ల వ్యవసాయ భూములు నీటమునగడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు.

 

అత్యధిక ప్రభావం చరాయిదేవు జిల్లాపై పడింది. అక్కడ ఒక్క జిల్లాలోనే 1.37 లక్షల మంది వరద బాధితులుగా నమోదయ్యారు. అనంతరం శివసాగర్, జోర్హాట్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రభుత్వం బాధితుల కోసం 71 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, 16,500 మందికి పైగా ఆశ్రయం కల్పిస్తోంది. అదనంగా 30 సహాయ కేంద్రాల ద్వారా 72 వేల మందికి పైగా నిత్యావసర వస్తువులు, ఆహారం, తాగునీరు అందజేస్తోంది.

 

వరదల కారణంగా రహదారులు, వంతెనలు, పాఠశాలలు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. 11,000కు పైగా పశువులు, ఇతర జీవాలు వరదల్లో కొట్టుకుపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక నష్టం సంభవించింది.

 

మరోవైపు రాష్ట్ర రాజధాని గువాహటిలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పడుంబరి, బోరాగావ్, జూ రోడ్, హాతిగావ్ తదితర ప్రాంతాల్లో పట్టణ వరదలు కొనసాగుతున్నాయి. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో బురద, చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన బృందాలు (SDRF), సైన్యం, స్థానిక అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పడవల ద్వారా చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.

 

— శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button