వాట్సాప్ వీడియో కాల్‌తో హనీట్రాప్.. రూ.9.29 లక్షలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
నార్సింగిలోని రాజపుష్ప ప్రొవిన్షియాలో నివాసం ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్లో ఆమె నగ్నంగా కనిపిస్తూ అసభ్యంగా ప్రవర్తించి, బాధితుడినీ అలాగే చేయాలని ప్రేరేపించింది.

వాట్సాప్ వీడియో కాల్లతో హనీట్రాప్.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసుల సూచన
నిజం న్యూస్, జూలై 11:
వాట్సాప్ వీడియో కాల్ ద్వారా హనీట్రాప్‌లో చిక్కుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.9,29,857 వసూలు చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న “సెక్స్టార్షన్” తరహా మోసాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగిలోని రాజపుష్ప ప్రొవిన్షియాలో నివాసం ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్లో ఆమె నగ్నంగా కనిపిస్తూ అసభ్యంగా ప్రవర్తించి, బాధితుడినీ అలాగే చేయాలని ప్రేరేపించింది.
కాల్ ముగిసిన కొద్దిసేపటికే అదే నంబర్ నుంచి మరో కాల్ వచ్చింది. ఈసారి ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ బాధితుడి వీడియోను ఎడిట్ చేసి చూపించాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు పంపిస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడి సోదరి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు వీడియో పంపినట్లు స్క్రీన్‌షాట్ పంపించి మరింత భయాందోళనకు గురి చేశాడు.
భయంతో బాధితుడు తొలుత రూ.82 వేలు, అనంతరం రూ.1.40 లక్షలు, తర్వాత రూ.2.60 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ నిందితులు బెదిరింపులు కొనసాగించడంతో విడతల వారీగా మరిన్ని మొత్తాలు పంపించాడు. చివరకు మొత్తం రూ.9,29,857 కోల్పోయాడు.
ఆ తర్వాత కూడా వేధింపులు ఆగకపోవడంతో బాధితుడు ధైర్యం చేసి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఒక నిందితుడి బ్యాంకు ఖాతాను అధికారులు బ్లాక్ చేసినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి హనీట్రాప్, సెక్స్టార్షన్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో నకిలీ మహిళా ప్రొఫైల్‌లతో వీడియో కాల్ చేసి, ఆ వీడియోలను ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ద్వారా లక్షల రూపాయలు దోచుకుంటున్న ముఠాలు చురుకుగా పనిచేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
నిజం న్యూస్ – ప్రజలకు సూచన
ప్రస్తుతం వాట్సాప్ వీడియో కాల్లు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న హనీట్రాప్ మరియు సెక్స్టార్షన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయకండి. ఒకవేళ కాల్ ఎత్తినా వ్యక్తిగతంగా లేదా అసభ్యకరంగా ప్రవర్తించవద్దు.
ఎవరైనా మీ ఫోటోలు లేదా వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడిగితే భయపడకండి. డబ్బులు పంపడం సమస్యకు పరిష్కారం కాదు. ఒకసారి చెల్లిస్తే మరింత డబ్బు కోసం మళ్లీ మళ్లీ వేధించే అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆధారాలను (స్క్రీన్షాట్లు, చాట్లు, లావాదేవీల వివరాలు) భద్రపరచి 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో విషయం పంచుకుని ధైర్యంగా చట్టపరమైన సహాయం తీసుకోండి.
అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ. తెలియని వీడియో కాల్‌కు స్పందించే ముందు ఒక్కసారి ఆలోచించండి.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



