18 నెలల పసికందును దారుణంగా హత్య చేసిన నిందితుడికి 41 రోజుల్లోనే మరణశిక్ష
18 నెలల వయస్సున్న ఆరవ్ అనే చిన్నారిని అత్యంత కిరాతకంగా నేలకేసి పదేపదే కొట్టి హత్య చేసిన జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్‌కు జిల్లా & సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.

నిజం న్యూస్, జూలై 11:
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా శికోహాబాద్‌లో ఈ ఏడాది మే 30, 2026న దేశాన్ని కలచివేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం 18 నెలల వయస్సున్న ఆరవ్ అనే చిన్నారిని అత్యంత కిరాతకంగా నేలకేసి పదేపదే కొట్టి హత్య చేసిన జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్‌కు జిల్లా & సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితుడు చిన్నారి తల్లి రతి దేవిని వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, తన కోరికకు చిన్నారే అడ్డుగా ఉన్నాడనే వికృత ఆలోచనతో పథకం ప్రకారం బాలుడిని ఇంటి బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో పలుమార్లు నేలకేసి కొట్టి హత్య చేశాడు. ఈ అమానుష ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో నిందితుడిపై బలమైన సాక్ష్యాలు లభించాయి.
ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. కేవలం ఆరు రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేయగా, ప్రాధాన్యతతో విచారణ చేపట్టిన ఫిరోజాబాద్ జిల్లా & సెషన్స్ జడ్జి డా. బబ్బు సారంగ్ కోర్టు అత్యంత వేగంగా కేసును విచారించింది. ప్రాసిక్యూషన్ తరఫున 13 మంది సాక్షులను విచారించిన అనంతరం, జూలై 9న నిందితుడిని దోషిగా నిర్ధారించి, జూలై 10, 2026న మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఘటన జరిగిన 41 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి మరణశిక్ష విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారిపై జరిగిన అత్యంత క్రూరమైన దాడిని “అత్యంత అరుదైన, అత్యంత హేయమైన నేరం (Rarest of Rare Case)”గా పరిగణించిన కోర్టు కఠినమైన శిక్ష విధించింది.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



