జ్యోతిష్కుడి మాట నమ్మి సొంత కొడుకునే హత్య చేసిన తండ్రి..

2023లో ఓ జ్యోతిష్కుడు "నీ కుమారుడు శ్రీకాంత్ వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది" అని వేందర్ బాలాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మాటలను నిజమని నమ్మిన బాలా తన కుమారుడిపై అనుమానం పెంచుకుని, అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

3 ఏండ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన దారుణ నిజం

నిజం న్యూస్, జూలై 11, 2026:

తమిళనాడులో తేని జిల్లాకు చెందిన వేందర్ బాలా (50) అనే వ్యక్తి, జ్యోతిష్కుడు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి తన 20 ఏళ్ల సొంత కుమారుడు శ్రీకాంత్ను దారుణంగా హత్య చేసిన ఘటన మూడేళ్ల తర్వాత వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సీబీసీఐడీ అధికారులు ఛేదించగా, విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

పోలీసుల కథనం ప్రకారం.. 2023లో ఓ జ్యోతిష్కుడు “నీ కుమారుడు శ్రీకాంత్ వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది” అని వేందర్ బాలాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మాటలను నిజమని నమ్మిన బాలా తన కుమారుడిపై అనుమానం పెంచుకుని, అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

పథకం ప్రకారం తన ఇద్దరు స్నేహితుల సహాయంతో శ్రీకాంత్‌ను ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అనంతరం నేర ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి ముల్లైపెరియార్ నదిలో పడేసినట్లు వెల్లడించాడు.

శ్రీకాంత్ కనిపించకుండా పోవడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో ఎలాంటి కీలక ఆధారాలు లభించకపోవడంతో కేసు ముందుకు సాగలేదు. అనంతరం ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు. సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, అనుమానితుల కదలికలను విశ్లేషించిన అధికారులు వేందర్ బాలాను అదుపులోకి తీసుకుని విచారించగా చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు.

ప్రధాన నిందితుడైన వేందర్ బాలాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. హత్యలో సహకరించిన మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనలో జ్యోతిష్కుడి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

మూఢనమ్మకాలు, జ్యోతిష్యంపై అంధ విశ్వాసం ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తుందో ఈ సంఘటన మరోసారి స్పష్టంగా తెలియజేసింది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం కోల్పోయి, మూఢనమ్మకాలకు బానిసైతే అమాయకుల ప్రాణాలే బలైపోతాయని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button