ఇన్‌కమ్ టాక్స్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఢిల్లీలో జాబ్ స్కాం గుట్టురట్టు..

ఇన్‌కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితుల్లో నమ్మకం కలిగించేందుకు ఢిల్లీలోని ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయ ప్రాంగణంలోనే నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. అధికారుల పేర్లతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలను కూడా సృష్టించి బాధితులను నమ్మించినట్లు పోలీసులు వెల్లడించారు.

మాజీ ఉద్యోగితో పాటు ముగ్గురు అరెస్ట్

నిజం న్యూస్, జూలై 11:
దేశ రాజధాని ఢిల్లీలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఇన్‌కమ్ టాక్స్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి భారీ స్థాయిలో మోసాలకు పాల్పడిన జాబ్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇన్‌కమ్ టాక్స్ శాఖ మాజీ ఉద్యోగి చిరాగ్ అగర్వాల్ ఉండటం సంచలనంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు ఇన్‌కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితుల్లో నమ్మకం కలిగించేందుకు ఢిల్లీలోని ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయ ప్రాంగణంలోనే నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. అధికారుల పేర్లతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలను కూడా సృష్టించి బాధితులను నమ్మించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పోస్టింగ్ ఆర్డర్లు వస్తాయని చెప్పి పలువురి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కొంతకాలం గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులను ఆశ్రయించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మరికొందరిని కూడా ఇదే విధంగా మోసం చేసి ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు, మధ్యవర్తుల మాటలను నమ్మవద్దని, అధికారిక నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియలను మాత్రమే విశ్వసించాలని పోలీసులు నిరుద్యోగులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు సంబంధిత శాఖల అధికారిక వెబ్‌సైట్లు, గుర్తింపు పొందిన నియామక సంస్థల ద్వారానే జరుగుతాయని, డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button