ప్రియుడి కోసం కాబోయే భర్త హత్య.. రూ.17 కోట్ల పెళ్లి కలలు క్షణాల్లో ఛిద్రమ్
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంచలన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పూణే, జూన్ 24 (స్టేట్ బ్యూరో):
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంచలన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది నవంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సిన యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా, ఆ మరణం వెనుక కాబోయే వధువు, ఆమె ప్రియుడి కుట్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రూ.17 కోట్ల వ్యయంతో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే ఈ విషాదం చోటుచేసుకోవడం రెండు కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు కేతన్ అగర్వాల్‌కు సియా గోయల్ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే సియా ఇప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కేతన్‌తో పెళ్లికి అంగీకరించినప్పటికీ, అతడిని వివాహం చేసుకోవడం ఆమెకు ఇష్టం లేకపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేతన్‌ను అడ్డు తొలగించాలని సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి పథకం రచించినట్లు తెలుస్తోంది. పూణే సమీపంలోని చారిత్రక లోహగడ్ కోట ప్రాంతానికి వెళ్లిన సమయంలో ట్రెక్కింగ్ పేరిట కేతన్‌ను కొండపైకి తీసుకెళ్లి, అక్కడి లోయలోకి తోసివేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించి అనుమానాలు రాకుండా చూసుకోవాలని ప్రయత్నించినట్లు విచారణలో తేలుతున్నట్లు సమాచారం.
తొలుత దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, కేతన్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో లోనావాలా పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, సందేశాల ఆధారంగా సియా గోయల్, చేతన్ చౌదరిల కదలికలను పరిశీలిస్తున్నారు.
ఇక ఈ ఘటనలో మరో కీలక అంశం ఏమిటంటే, కేతన్–సియా వివాహం ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సి ఉండగా, జైపూర్‌లో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో పెళ్లి వేడుకల కోసం కుటుంబ సభ్యులు ముందుగానే భారీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వేదికలు, అతిథుల వసతి, వివాహ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే పెళ్లి వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే వరుడి మృతి చెందడం, ఆ ఘటన వెనుక ప్రేమ వ్యవహారం మరియు హత్య కుట్ర కోణం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



