ఖాకీ కక్కుర్తికి ఏసీబీ చెక్.. రూ.50 వేల లంచంతో పట్టుబడ్డ ఎస్‌ఐ అరెస్ట్
స్టేషన్ బెయిల్ కోసం రూ.1 లక్ష డిమాండ్.. తొలి విడత లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

హైదరాబాద్, జూన్ 23 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్):
హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వి. నర్సింహులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. అధికారిక విధులు నిర్వహించేందుకు లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.50 వేల నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.
ఏసీబీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం, అలాగే భవిష్యత్తులో ఫిర్యాదుదారుడిని వేధించకుండా ఉండడం కోసం ఎస్‌ఐ నర్సింహులు మొత్తం రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని చర్యలు చేపట్టారు.
మంగళవారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి నుంచి తొలి విడతగా రూ.50 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో ఎస్‌ఐ తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ అక్రమ లబ్ధి పొందేందుకు విధులను అసమర్థంగా, అవినీతిపరంగా నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.
లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు చేయడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
– శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



