మరిపెడ పోలీసుల భారీ ఆపరేషన్‌లో నకిలీ విత్తనాల గుట్టురట్టు

మరిపెడ పోలీసుల భారీ 12 కిలోల BT-3 విత్తనాలు స్వాధీనం – రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవు: పోలీసులు

నిజం న్యూస్ | మహబూబాబాద్ | జూన్ 21 (ఆదివారం):

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పి. ఐపీఎస్ ఆదేశాలు, తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ సూచనల మేరకు మరిపెడ పోలీసులు గుండెపూడి గ్రామంలో ఈరోజు (ఆదివారం) ఉదయం 5 గంటల సమయంలో భారీ ఆపరేషన్ నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేసి నిర్వహించిన దాడుల్లో సుమారు 12 కిలోల నకిలీ BT-3 విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

 

దాడుల అనంతరం గ్రామస్తులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించిన పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎదుర్కొనే తీవ్ర నష్టాలపై వివరించారు. నకిలీ BT-3 విత్తనాలను ఉపయోగించడం వల్ల పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు రైతులు పెట్టుబడులు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అదేవిధంగా భూసారం క్షీణించడం, పురుగుమందుల వినియోగం పెరగడం, పంటల నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

 

నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అప్పుల భారం పెరిగి మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు పేర్కొన్నారు. రైతుల కష్టార్జిత ధనాన్ని దోచుకునే నకిలీ విత్తనాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పోలీసులు స్పష్టం చేశారు.

 

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్, మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్, సీరోల్ ఎస్సై గండ్ర సంతోష్, చిన్నగూడూరు ఎస్సై కుశకుమార్, ఎస్సై మహబూబీ, ఎస్సై ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు 30 మంది పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగస్వాములయ్యారు.

 

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button