తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్?
తెలంగాణ పోలీసు శాఖలో ప్రస్తుతం 19 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో కానిస్టేబుల్, ఎస్ఐ, టెక్నికల్, ప్రత్యేక విభాగాలకు చెందిన ఉద్యోగాలు కూడా ఉండే అవకాశముందని తెలుస్తోంది. దశల వారీగా ఖాళీల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముందుగా 5 వేల పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు పోలీసు శాఖ నుంచి ఆర్థిక శాఖకు చేరినట్లు తెలిసింది.

హైదరాబాద్, మే 30 (నిజం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాల భర్తీపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. తొలి దశలో దాదాపు 5 వేల పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
తెలంగాణ పోలీసు శాఖలో ప్రస్తుతం 19 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో కానిస్టేబుల్, ఎస్ఐ, టెక్నికల్, ప్రత్యేక విభాగాలకు చెందిన ఉద్యోగాలు కూడా ఉండే అవకాశముందని తెలుస్తోంది. దశల వారీగా ఖాళీల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముందుగా 5 వేల పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు పోలీసు శాఖ నుంచి ఆర్థిక శాఖకు చేరినట్లు తెలిసింది.
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పోలీసు నియామకాలు పరిమిత స్థాయిలోనే జరగడంతో ఖాళీలు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతి ఏడాది సుమారు 2 వేల మందికిపైగా పోలీసులు వివిధ హోదాల్లో పదవీ విరమణ చేయడంతో సిబ్బంది కొరత మరింత తీవ్రంగా మారుతోంది. దీంతో ప్రస్తుతం విధుల్లో ఉన్న పోలీసులపై పనిభారం అధికమవుతోందని సమాచారం.
ప్రభుత్వం ఇటీవల సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణ వంటి విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో, కొత్తగా ఎంపికయ్యే సిబ్బందిలో అధిక మందిని ఈ విభాగాల్లో వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, డిజిటల్ ఫ్రాడ్ కేసులను ఎదుర్కొనేందుకు సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, ఉద్యోగాల సంఖ్య, పోస్టుల వివరాలు, అర్హతలు, వయోపరిమితి, పరీక్షల షెడ్యూల్‌పై అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. దీంతో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.