మురికి కూపంగా లింగగిరి చెరువు..వందల సంఖ్యలో చేపల మృతి..!

డ్రైనేజీ నీటి ప్రవాహం వల్ల చెరువు నిరుపయోగంగా మారుతోందని ఆవేదన ..!

కలుషిత నీటితో వందల సంఖ్యలో చేపల మృతి చెందుతున్నాయని గ్రామ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కీసరి నరసింహారావు తెలిపారు. హుజూర్‌నగర్ మండలం లింగగిరి గ్రామ చెరువు మత్స్యకారుల పాలిట మృత్యుకుహరంగా మారిందన్నారు.

కాలువ నుంచి వెలువడుతున్న మురుగునీరు నేరుగా చెరువులోకి వచ్చి చేరుతుండటంతో నీరు పూర్తిగా కలుషితమై చేపలు ఊపిరాడక విలవిల్లాడుతూ మృత్యువాత పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా డ్రైనేజీ నీరు నిరంతరాయంగా చెరువులోకి వస్తుండటంతో స్వచ్ఛమైన నీరు కాస్తా మురికిగా మారింది.

దీనికి తోడు చెరువు ఉపరితలంపై గుర్రపుడెక్క విపరీతంగా అలుముకోవడంతో లోపల ఉన్న చేపలకు ఆక్సిజన్ అందడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. సోమవారం నాటికి వందల సంఖ్యలో చేపలు చనిపోయి నీటిపై తేలడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ విషయమై గ్రామ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కీసరి నరసింహారావు మాట్లాడుతూ…
డ్రైనేజీ నీటి ప్రవాహం వల్ల చెరువు నిరుపయోగంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “మురుగునీరు చేరకుండా ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది.

ఇప్పుడు పెట్టుబడి కూడా తిరిగి రాక మత్స్యకారులు వీధిన పడే పరిస్థితి నెలకొంది” అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మురుగునీటి మళ్లింపునకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button