జాన్పాహాడ్ దర్గా వద్ద ‘దౌర్జన్యాల’ దందా..!
దర్గా ప్రాంగణంలోనే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు; మహిళా భక్తుల బెంబేలు..!

సూర్యాపేట జిల్లా పాలక వీడు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జాన్ పహాడ్ దర్గా వద్ద భక్తుల కష్టాలు అరణ్య రోదనగా మారాయి. కొన్ని దశాబ్దాలుగా ఇలవేల్పుగా నమ్మి వస్తున్న భక్తులను ఇక్కడి అక్రమ వసూళ్లు, మద్యం మాఫియా పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆధ్యాత్మికత వెల్లివిరియాల్సిన చోట అధికార పార్టీ అండతో కొందరు నాయకులు బరితెగించి సాగిస్తున్న ఆగడాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
వ్యాపారంగా మారిన భక్తి..!
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వేలం పాటల్లో భారీ ధరలకు టెండర్లు దక్కించుకుని, ఆ పెట్టుబడిని రాబట్టుకునేందుకు భక్తులపై పడుతున్నారు. పార్కింగ్ నుంచి మొదలుకొని దర్శనం వరకు ప్రతిచోటా అడ్డగోలుగా పైసలు వసూలు చేస్తున్నారు. “ఎందుకు ఇంత కట్టాలి?” అని ప్రశ్నించిన భక్తులపై దౌర్జన్యాలకు దిగడం, బెదిరించడం ఇక్కడ నిత్యకృత్యమైంది. ఫలితంగా, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే పేద భక్తులు భయపడి పోతున్నారు.
మద్యం మత్తులో దర్గా ప్రాంగణం..!
ఒకప్పుడు దర్గా పరిసరాల్లో మద్యం అమ్మకాలు నిషేధంలో ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. దర్గాను ఆనుకుని బహిరంగంగా బెల్టు షాపులు వెలిశాయి. మద్యం బాటిళ్లను ప్రదర్శిస్తూ విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తుండటంతో మహిళా భక్తులు దర్గా చుట్టూ తిరగాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఈ నెల 10వ తేదీన ఎక్సైజ్ సి.ఐ.కి ఫిర్యాదు చేసినా, నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆదాయం వక్ఫ్ బోర్డుకు.. కష్టాలు భక్తులకు..!
ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా, వక్ఫ్ బోర్డు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. తాగునీరు, మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులను భరించలేక చాలామంది భక్తులు దర్గా వద్ద విందులు చేసుకోకుండా, మొక్కులు తీర్చుకుని మూగజీవాలను ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు.
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు..?
దర్గా పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు, పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ వారు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి. అడ్డగోలు వసూళ్లను అరికట్టి, దర్గా క్షేత్ర పరిసరాల్లో బెల్టు షాపులను తక్షణమే తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే జాన్పాహాడ్ దర్గాకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



