పంటలను కాపాడేందుకు వెంటనే నీరు వదలాలి …మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వినతి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్‌ను మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో నెలకొన్న పలు కీలక ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా రైతులు, కూలీలు మరియు గ్రామాల అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆమె కోరారు

పంటలను కాపాడేం దుకు వెంటనే నీరు వదలాలి – ఉపాధి హామీ సమస్యలు పరిష్కరించాలి: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వినతి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్‌ను మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో నెలకొన్న పలు కీలక ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా రైతులు, కూలీలు మరియు గ్రామాల అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ఆకేరు, మున్నేరు వాగులు ఎండిపోవడంతో వేలాది ఎకరాల్లో సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, కురవి మండలాలతో పాటు గార్ల, బయ్యారం మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయాయని వివరించారు. గతంలో ఎస్ఆర్ఎస్పీ జలాలను వాగుల్లోకి విడుదల చేసినప్పుడు భూగర్భ జలాలు పెరిగి రైతుల పంటలు రక్షించబడ్డాయని గుర్తుచేసి, ప్రస్తుతం కూడా వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే నిరుపేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకంలో ఇటీవల అమలు చేస్తున్న బయోమెట్రిక్ నమోదు మరియు ఫోటో తీసుకునే విధానాల వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. టెక్నికల్ సిబ్బంది కొరత కారణంగా పలు చోట్ల పనులు చేస్తున్న కూలీలకు పేస్ రీడింగ్ సకాలంలో చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పద్ధతిలో మార్పులు చేయడం లేదా సిబ్బందిని పెంచడం ద్వారా కూలీలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఇక తన మంత్రిత్వ కాలంలో మంజూరు చేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచ్‌లు మరియు ప్రజా ప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం చేసిన పనులకు తక్షణమే బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు.
జిల్లాలో ఉన్న భూ సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న రైతుల పేర్లకు భూములు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను సమగ్రంగా పరిశీలించి ఉన్నతాధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాదె నాగయ్య, గుగులోత్ నెహ్రూ, అల్లూరి కిషోర్ వర్మ, మన్యు ప్యాట్నీ, భద్రు, పాల్య్తా లాలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



