రైతు భరోసాలో కొత్త రైతులకు ఛాన్స్..!
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కొత్త రైతులకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైతు భరోసా పథకంలో నమోదు కాని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు ఈ పథకంలో చేరేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

జూలై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, జూన్ 27 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్):
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కొత్త రైతులకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైతు భరోసా పథకంలో నమోదు కాని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు ఈ పథకంలో చేరేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హులైన రైతులు జూలై 5 వరకు తమ దరఖాస్తులు సమర్పించాలని వ్యవసాయశాఖ సూచించింది.
కొత్త నమోదులకు గ్రీన్ సిగ్నల్
రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) లేదా మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
అవసరమైన పత్రాలు ఇవే..
దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ, రైతు భరోసా దరఖాస్తు ఫారంను సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.
జూలై 5 చివరి గడువు
రైతులు తమ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు జూలై 5ను చివరి తేదీగా నిర్ణయించారు. వ్యవసాయశాఖ అధికారులు సీసీఎల్‌ఏ డేటా ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన రైతులను లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు.
జూన్ 30న నిధుల జమకు ఏర్పాట్లు
రైతు భరోసా నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు వేగవంతం చేసింది. ప్రకటించిన ప్రకారం జూన్ 30న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది పట్టాదారులు ఈ పథకం పరిధిలో ఉన్నారు.
గత ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించింది. ఈసారి కూడా అదే తరహాలో నిధుల విడుదల చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దశలవారీగా నగదు బదిలీ
భూవిస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని దశలవారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 10 ఎకరాలకు మించిన భూమి కలిగిన రైతులకు ఒకేసారి నగదు బదిలీ చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది రోజుల్లోనే నగదు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలి
అర్హులైన రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. పత్రాలు సక్రమంగా ఉంటే రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో పేరు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది.
– శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



