బాలికకు బంధువే… అయినా.. మైనర్ బాలిక మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
నిందితుడు బాలికకు బంధువే అయినప్పటికీ, మారుపేర్లతో ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా పరిచయం పెంచుకుని తాను మల్లా రెడ్డి కాలేజీ విద్యార్థి అని నమ్మించి ప్రేమ పేరుతో ఆమెను వంచించినట్లు తేలింది. కానీ ఇప్పటికే తనకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

వరుసకు చెల్లి అయ్యే మైనర్ బాలిక మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
ప్రేమ పేరుతో మోసం… బెదిరింపులతో విషాదాంతం
స్టేట్ బ్యూరో నిజం న్యూస్:ఏప్రిల్ 23
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లో మైనర్ బాలిక మృతికి కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కురవి ఎస్సై గండ్రాతి సతిష్ తెలిపారు.
కురవి ఎస్సై గండ్రాతి సతిష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 14-04-2026న ఒక మైనర్ బాలిక గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి అనంతరం చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, ఆమె 18-04-2026న చికిత్స పొందుతూ మృతి చెందింది.
మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో బానోత్ కిరణ్ అనే వ్యక్తి కారణమని బాలిక పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
దర్యాప్తులో నిందితుడు బాలికకు బంధువే అయినప్పటికీ, మారుపేర్లతో ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా పరిచయం పెంచుకుని తాను మల్లా రెడ్డి కాలేజీ విద్యార్థి అని నమ్మించి ప్రేమ పేరుతో ఆమెను వంచించినట్లు తేలింది. కానీ ఇప్పటికే తనకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అలాగే, నిందితుడు వరుసకు అన్న అవుతాడు అని తెలుసుకున్న తరువాత బాలిక నిందితుడిని దూరం పెట్టేందుకు ప్రయత్నించగా, నిందితుడు తన దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్స్ బయటపెడతానని, పరువు తీస్తానని బెదిరించగా ఒత్తిడిని తట్టుకోలేక బాలిక గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి అనంతరం మృతి చెందినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, నిందితుడు గతంలో కూడా తాను లాయర్ అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పోక్సో (POCSO) కేసులో శిక్ష పడ్డ నిందితుడికి హైకోర్టులో బెయిల్ ఇప్పిస్తానని చెప్పి నిందితుడి తండ్రి నుండి సుమారు 12 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి గోల్డ్ చైన్ స్నాచింగ్ కేసులో కూడా నిందితుడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపారు.
ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు, కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతిష్ తెలిపారు.



