అక్రమ సంబంధం కోసం భర్తను హత్య..! గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం – నిజామాబాద్‌లో సంచలనం
అంబం గ్రామానికి చెందిన మహిపాల్‌ను అతని భార్య స్వరూప, తన ప్రియుడితో కలిసి ఉరి వేసి హత్య చేసినట్లు తేలింది.

01 జూలై 2026 | నిజం న్యూస్
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. అంబం గ్రామానికి చెందిన మహిపాల్‌ను అతని భార్య స్వరూప, తన ప్రియుడితో కలిసి ఉరి వేసి హత్య చేసినట్లు తేలింది. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే మృతదేహం మెడపై ఉరి వేసిన ఆనవాళ్లు, గాయాల గుర్తులు కనిపించడంతో బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దర్యాప్తులో భాగంగా భార్య స్వరూపను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అంబం గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో | నిజం న్యూస్



