భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కింది..! చెన్నైని కుదిపేసిన దారుణ హత్య
జూన్ 5 ఉదయం ప్లాట్‌ఫారమ్ సమీపంలో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన రైల్వే సిబ్బంది సూట్‌కేస్‌ను పరిశీలించగా, అందులో కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. తల, చేతులు, కాళ్లు లేకపోవడంతో కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

చెన్నై, జూన్ 9 (నిజం న్యూస్): తమిళనాడు రాజధాని చెన్నైలో అమానుష హత్య వెలుగులోకి వచ్చింది. భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కి రైల్వే స్టేషన్‌లో పడేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చెన్నైలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు, కాళ్లు లేని మొండెం మాత్రమే ఉన్న మృతదేహం కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం చేపట్టిన లోతైన దర్యాప్తులో ఈ హత్య వెనుక భార్యతో పాటు ఆమె ప్రియుడు ఉన్నట్లు తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన అమీర్ అలీ (40)గా గుర్తించారు. అతడు చెన్నై తేనాంపేట ప్రాంతంలో నివాసం ఉంటూ, ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు వసతి, సహాయక సేవలు అందించే పని చేసేవాడు. భార్య రోహిమా ఖాతూన్తో తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. అమీర్‌కు మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో భార్య ఆగ్రహం పెరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో రోహిమా తన స్నేహితుడు అష్రఫ్ అలీతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. ముందుగా మత్తు మందు ఇచ్చి, అనంతరం గొంతు కోసి హత్య చేసిన తర్వాత శవాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు వెల్లడైంది. మొండెాన్ని సూట్‌కేస్‌లో పెట్టి చెన్నైలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్-4 సమీపంలో వదిలివెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.
జూన్ 5 ఉదయం ప్లాట్‌ఫారమ్ సమీపంలో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన రైల్వే సిబ్బంది సూట్‌కేస్‌ను పరిశీలించగా, అందులో కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. తల, చేతులు, కాళ్లు లేకపోవడంతో కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే శవం చుట్టూ ఉన్న మెడికల్ వేస్ట్ బ్యాగ్, దుస్తుల ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ లొకేషన్ వంటి ఆధారాలతో పోలీసులు నిందితుల జాడను కనుగొన్నారు.
ఇప్పటికే నిందితులైన భార్య రోహిమా ఖాతూన్, ఆమె స్నేహితుడు అష్రఫ్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, మృతుడి తల, చేతులు, కాళ్లను చెన్నై పరిసర ప్రాంతాల్లో వేర్వేరుగా పారేసినట్లు భావిస్తున్న పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. కొన్ని శరీర భాగాలు చెంగల్పట్టు సమీపంలోని సరస్సు, బకింగ్‌హామ్ కాలువ ప్రాంతాల్లో లభించినట్లు సమాచారం.



