రైతులకు శుభవార్త.. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల

మధిర రైతు సమ్మేళనం వేదికగా ఖాతాల్లో జమ ప్రారంభం – ఏడు రకాల సన్న ధాన్యాలకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

నిజం న్యూస్, హైదరాబాద్, జూన్ 18:

వానాకాలం పంటల సాగుకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో భారీ స్థాయిలో రైతుల సమ్మేళనం నిర్వహించి, అదే వేదికగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

 

రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే ప్రక్రియకు మధిర సభ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు సాగు వ్యయ భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

 

అదేవిధంగా సన్న ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఏడు రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలని సమావేశం నిర్ణయించింది. మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ప్రజల వినియోగం, అధిక దిగుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

బోనస్ వర్తించే సన్న ధాన్య రకాలు:

 

బీపీటీ-5204

 

ఆర్‌ఎన్‌ఆర్-15048

 

హెచ్‌ఎంటీ సోనా

 

జై శ్రీరామ్

 

కేఎన్‌ఎం-1638

 

డబ్ల్యూజీఎల్-44

 

కేఎన్‌ఎం-7715

 

 

రాష్ట్ర రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశారని మంత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి కొత్త రికార్డు సృష్టించిందని తెలిపారు.

 

సమావేశం అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ సీతక్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచి కేంద్రం తక్కువ ధాన్యం సేకరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి మరోసారి కేంద్రాన్ని కలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

 

రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్‌లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అధిక భాగం తెలంగాణకే కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాలకు తరలించకుండా రాష్ట్ర రైతుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడింది.

 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది. కేంద్రం ప్రతిపాదించిన కొత్త విధానాల ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

 

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన అన్ని అనుమతులను కేంద్రం వెంటనే మంజూరు చేయాలని సమావేశం కోరింది. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. నగర ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో విస్తరణ అత్యంత కీలకమని మంత్రులు పేర్కొన్నారు.

 

ఇక ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని కూడా సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని 208 పరీక్షా కేంద్రాల్లో సుమారు 2 లక్షల 95 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button