కురవిలో లారీని ఢీకొట్టిన నాగార్జున విద్యాలయ స్కూల్ బస్సు..?

ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా?

ఒకే బస్సుతో మూడు, నాలుగు రూట్లు..

నిజం న్యూస్ | జూలై 8, 2026

మహబూబాబాద్ జిల్లా కురవి–ఖమ్మం ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కురవి సమీపంలోని మొదలగూడెం మూల వద్ద నాగార్జున విద్యాలయానికి చెందిన స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ముందున్న లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

స్థానికుల కథనం ప్రకారం, బస్సు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

 

స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం, ఒకే స్కూల్ బస్సును మూడు నుంచి నాలుగు వేర్వేరు రూట్లలో విద్యార్థులను తీసుకురావడానికి వినియోగిస్తున్నారని, సమయానికి అన్ని రూట్లను పూర్తి చేసి స్కూలుకు చేరుకోవాలనే తొందరలో డ్రైవర్ అతివేగంగా బస్సు నడుపుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమైందని వారు పేర్కొంటున్నారు.

 

ఇదిలా ఉండగా, స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నాడని, ఆయనను మార్చాలని గతంలో పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అదే డ్రైవర్‌తో బస్సులను కొనసాగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

అదేవిధంగా, ప్రమాదానికి గురైన స్కూల్ బస్సుకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, బీమా, అనుమతులు మరియు ఇతర రవాణా సంబంధిత పత్రాలు ఉన్నాయా లేదా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button