హుజూర్ నగర్ లో గంజాయి ముఠా గుట్టురట్టు: నలుగురు అరెస్ట్..!

1.5 కిలోల గంజాయి, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం..!

హుజూర్‌నగర్ పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు గురువారం రాత్రి చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 75 వేల విలువైన 1.5 కిలోల గంజాయిని, ఒక మోటార్ సైకిల్ మరియు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జి. చరమంద రాజు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్.ఐ. బండి మోహన్ తన సిబ్బందితో కలిసి పట్టణ శివారులోని పెర్ల్ ఇన్ఫినిటీ స్కూల్ వెనుక ఉన్న ఖాళీ ప్లాట్ల వద్ద నిఘా పెట్టారు. ఉదయం 11:15 గంటల సమయంలో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు తేలింది. అరెస్టు అయిన వారిలో 1. షేక్ సుభాని (A-1) కోదాడ నివాసి, లారీ డ్రైవర్. 2. చౌడం యశ్వంత్ (A-2) హుజూర్‌నగర్, ప్రైవేట్ ఉద్యోగి. 3. ములకలపల్లి నాగ మణికంఠ (A-3) హుజూర్‌నగర్, విద్యార్థి. 4.షేక్ అబ్దుల్ అజీజ్ (A-4) చిలుకూరు మండలం, విద్యార్థి.

సీలేరు నుంచి హుజూర్‌నగర్‌కు సరఫరా..!

ప్రధాన నిందితుడైన షేక్ సుభాని ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సాయి అనే వ్యక్తి నుంచి కేవలం రూ. 8,000లకు ఈ గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గంజాయిని హుజూర్‌నగర్‌లో అధిక ధరలకు విక్రయించేందుకు తన స్నేహితుడైన యశ్వంత్ సాయంతో ఇక్కడికి తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button